ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రశ్రేణి రాష్ట్రాల సరసన నిలిపే ప్రయత్నంలో సరికొత్త ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రాష్ట్ర విభజన చట్టం ద్వారా అంది వచ్చిన హక్కును కూడా వాడుకుంటూ.. ఏపీలోని నగరాలను దేశంలోని అగ్రశ్రేణి నగరాలకు దీటుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రపంచం మొత్తం తల తిప్పి చూసే అత్యుత్తమ నగరంగా నిర్మించడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అమరావతికి సమాంతరంగా ఇతర నగరాలను కూడా ఆధునిక తరానికి అనుగుణంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు అవుతున్నాయి. విజయవాడ విశాఖపట్నం నగరాలకు మెట్రో రైల్ వ్యవస్థను తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. ఇంచుమించుగా 42 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డిపిఆర్లను సిద్ధం చేయించి కేంద్రం అనుమతి కోసం ఏపీ సర్కారు పంపడం జరిగింది. విభజన చట్టంలో ఏపీలోని మెట్రో రైలు ఏర్పాటుకు కేంద్రం సహకరించాలనే నిబంధనను అనుసరించి 100 శాతం నిధులను కేంద్రమే ఇచ్చేలా ఒప్పించడానికి ప్రయత్నం జరుగుతోంది.
మెట్రోరైలు వ్యవస్థ అనేది ఆధునిక నగర జీవితంలో ఒక అనివార్యమైన హంగుగా తయారైంది. కొంచెం పెద్దస్థాయి నగరాలలో ప్రజారవాణా సుఖమయంగా ఉండడానికి మెట్రోరైళ్లు మంచిగా సేవలు అందిస్తున్నాయి. పరిస్థితి ఎలా తయారైందంటే.. మెట్రో రైల్ ఉన్న నగరాలు మాత్రమే అంతోఇంతో పెద్ద నగరాలు అని ప్రజలు అనుకునే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క నగరంలో కూడా మెట్రో రైలు లేకపోవడం బాధ కలిగిస్తుంది.
చంద్రబాబునాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు విజవాడ, విశాఖపట్టణం రెండు నగరాలకు మెట్రో తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ జగన్ మళ్లీ సీఎం కాగానే.. మొత్తం ఆ ప్రయత్నాలను తొక్కిపెట్టారు. ఎన్నికలకు ముందు.. నాటకం ఆడడానికి విశాఖకు మెట్రో తెస్తున్నట్టుగా కొన్ని ప్రకటనలు చేశారు తప్ప అడుగు ముందుకు పడలేదు.
ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కేవలం మూడునెలలలోనే అవసరమైన డీపీఆర్ లు తయారుచేయించి.. ఈ రెండు నగరాల మెట్రో రైలు స్వప్నాలను సాకారం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ రెండు నగరాల్లోనూ మెట్రో ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ఖర్చు 2799 కోట్ల రూపాయలను రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. ఈ రెండింటి నిర్మాణానికి 42,362 కోట్ల రూపాయలతో డీపీఆర్ లు సిద్ధం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. విజయవాడలో మూడు కారిడార్ల పనులను రెండు దశల్లో చేపట్టడానికి 25,130 కోట్లు, విశాఖలో రెండుదశల్లో నాలుగు కారిడార్ల పనులకు 17,232 కోట్లు అంచనావేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రమే నిధులివ్వాలని ఉంది గనుక.. సహకరించాలని కోరారు. కోల్ కతలో ఇచ్చినట్టుగా 100శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదనలకు కేంద్రం పచ్చజెండా ఊపితే గనుక.. గొప్ప విజయంసాధించినట్టే. ఈ అయిదేళ్లలో మెట్రోపనులు కూడా కనీసం ప్రారంభం అయితే చంద్రబాబు ప్రభుత్వానికి గొప్ప కీర్తి వస్తుంది.
ఏపీకి రెండు మెట్రోలు: కేంద్రం పచ్చ జెండా ఎత్తితే పండగే!!
Tuesday, January 21, 2025