ఇన్నాళ్లూ వివిధ పథకాల కింద ప్రజలకు డబ్బులు పంచుతూ వచ్చింది ఎందుకు? ఈ ఎన్నికల సమయంలో వారందరితోనూ ఓట్లు వేయించుకోవడానికే కద! మరి ఇప్పుడు వాతావరణం అంత సానుకూలంగా కనిపించడం లేదే! ఏమిటి మన తక్షణ కర్తవ్యం?? అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, వారికి కొమ్ముకాస్తున్న అధికారుల ప్రధాన టెన్షన్ గా ఉంటోంది. ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులందరినీ ఒకచోట పోగేసి.. వారితో ‘మీకు మేం అంత డబ్బులు ఇచ్చాం.. ఇంత డబ్బులు ఇచ్చాం..’ అంటూ వారిని మాయచేసి ఓట్లు వేయించుకోవడానికి కొత్త ఎత్తుగడ ఎత్తినట్టుగా కనిపిస్తోంది.
మొన్నటిదాకా గడపగడపకు పేరుతో ఎమ్మెల్యేలను ఇంటింటికీ తిప్పడం వెనుక జగన్ ప్రధాన వ్యూహం వేరు! ప్రతి ఇంటికీ ప్రభుత్వం నుంచి ఎంతెంత సొమ్ము పథకాల రూపంలో అందిందో.. వారి చేతిలో ఒక కాగితం పెడుతూ.. ఆ డబ్బు మొత్తం జగన్మోహన్ రెడ్డే ఇచ్చారని, కాబట్టి జగనన్నకు రుణపడి ఉండాలని, మళ్లీ ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేయడమే దాని లక్ష్యం. జగన్ యొక్క ప్రతి ఆలోచన కూడా నేను మీకు ఇంతింత డబ్బు ఇచ్చాను గనుక.. మీరు నాకు ఓటు వేసి తీరాల్సిందే అన్నట్టుగానే ఉంటోంది. ఆయన తన ఎన్నికల ప్రచార సభల్లో కూడా మీ ఇంటికి పథకాల డబ్బు అంది ఉంటేనే నాకు ఓటు వేయండి.. లేకపోతే ఓటు వేయవద్దు అని చెబుతున్నారంటే.. డబ్బు పంపకం ఓట్లు కురిపిస్తుందని ఎంతగా నమ్ముకుని ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఆ క్రమంలో భాగంగానే.. విద్యార్థుల తల్లిదండ్రులు అందరినీ ఫైనల్ గా ఎన్నికలకు ముందు మరోసారి మభ్యపెట్టడానికి జగన్ వ్యూహరచన చేసినట్టు కనిపిస్తోంది.
ఈనెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ప్రవీణ్ ప్రకాష్ స్కూళ్లకు ఆదేశాలు జారీచేశారు. ఆ సమావేశాల్లో పిల్లల ప్రోగ్రెస్ రిపోర్టులు తల్లిదండ్రులకు ఇవ్వాలని కూడా సూచించారు. అయితే ఈ సమావేశాలు అచ్చంగా.. ఎన్నికలకు ముందు తల్లిదండ్రులను ప్రభావితం చేయడానికే అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అమ్మఒడి పేరుతో ప్రతి ఇంటికీ భారీగా డబ్బులు ఇస్తున్న ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని పరోక్షంగా వారికి చెప్పేందుకే సమావేశాలు పెడుతున్నట్టు ఉపాధ్యాయ వర్గాల్లోనే వినిపిస్తోంది. అసలు కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి సమావేశాలు నిర్వహించడానికి నిబంధనలు అంగీకరిస్తాయా? అనే చర్చ కూడా నడుస్తోంది.
విద్యార్థుల పేరెంట్స్ ను మభ్యపెట్టే కుయుక్తి!
Saturday, January 18, 2025