మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. అలాగని ఖాళీగా ఉన్నట్టు కనిపించకూడదు. ప్రజల కోసం పోరాడుతున్నట్టుగా కనిపించాలి. కానీ, చంద్రబాబు పరిపాలనలో ప్రజలకు ఏం నష్టం జరుగుతున్నదో తెలియదు, ఏ విషయం మీద పోరాటం చేయాలో కూడా తెలియడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జగనన్న ఉబుసుపోక ఎక్స్ ఖాతాలో పోస్టులు పెట్టుకుంటూ రోజులు నెడుతున్నట్టుగా కనిపిస్తోంది. లిక్కర్ మాఫియాకు రాష్ట్రాన్ని అడ్డాగా మార్చేశారంటూ జగన్ తాజాగా ఒక పోస్టు పెట్టారు. లిక్కర్ వ్యాపారంలో ఇప్పుడు ఏర్పడుతున్న సిండికేట్లకు అసలు పాత్రధారి, సూత్రధారి చంద్రబాబునాయుడు అన్నట్టుగా ఆయన ట్వీట్ చెబుతోంది. ఇంతకూ పాత్రధారి, సూత్రధారి అనే పదాలకు అర్థం తెలిసే జగన్ ఈట్వీట్ చేశారా? అనే సందేహం కలుగుతోంది.
తన పరిపాలన సాగినరోజుల్లో ప్రజల ఆరోగ్యాన్ని హరించివేసే చవకబారు, నాసిరకం సొంత బ్రాండ్ లిక్కరును మాత్రమే రాష్ట్రంలో అమ్ముతూ.. దానికి కూడా అతి భయంకరమైన భారీ రేట్లు పెట్టి దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబునాయుడు పెంచిన రేట్ల గురించి మాట్లాడుతున్నారు. జగన్ హయాంలో ఇంచుమించుగా రూ.200 వద్ద ఉన్న లిక్కర్ ధరను చంద్రబాబు రూ.99కి తీసుకువచ్చారు. ఈ లిక్కర్ ధరలను కొత్త మద్యం విధానంలో పెంచలేదు. కేవలం ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విషయంలో మాత్రమే.. వాటి ధర ఉండేదానిని బట్టి.. పెంచారు. వాటి ధర 101, 102 రూపాయలు ఉన్నట్లయితే 110 రూపాయలు ఉండేలా ఆ తర్వాతి రౌండ్ ఫిగర్ కు ధరలు పెంచేలా పాలసీ చేశారు. ఇది ఖరీదైన బ్రాండ్లకు మాత్రమే పరిమితమైన పెంపు. పైగా నిర్దిష్టంగా ఇంత శాతం పెంచడం అనేది లేదు. కేవలం చిల్లర సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు పెంచిన ధర మాత్రమే. దీని గురించి.. ఎడాపెడా దోచుకున్న జగన్.. ధరలపెంపు అని మొసలి కన్నీరు కారుస్తున్నారు.
సిండికేట్లు అయ్యారు.. ప్రజలను దోచుకుంటున్నారు.. అని జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. సిండికేటు అయిన మాట నిజమే అనుకుందాం. కానీ అందులో ప్రజలను దోచుకోవడం అనే పార్ట్ ఎక్కడుంది? సిండికేట్ అయితే వచ్చే లాభాలను ఒక్క వ్యక్తి కాకుండా కొందరు వ్యక్తులు పంచుకోవడం జరుగుతుంది. అంతే తప్ప.. షాపు నిర్వహిస్తున్నది ఒకే వ్యక్తినా లేదా సిండికేటా అనే సంగతికి- ప్రజలకు ఏం సంబంధం ఉండదు. వారికి దొరికే ధరకే దొరుకుతుంది. పైగా జగనన్నలాగా నాసిరకం కల్తీ మద్యాన్ని భారీ ధరలకు కొనడం కాదు. చీప్ లిక్కర్ చీప్ గానే దొరుకుతుంది. పైగా అలవాటైన వారికి ఖరీదైన బ్రాండ్లు అన్నీ కూడా దొరుకుతాయి.
జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే.. సిండికేట్ల వలన ప్రజలకు జరిగే నష్టం లేదు. ఆ సంగతి అర్థం కాకుండా.. అమాయకంగా.. ప్రజల తరఫున పోరాడుతాను అని నాటకీయ డైలాగులు చెబితే ప్రజలే నవ్వుకుంటారు.