ఎన్డీయే కూటమిలో భాగస్వామి కాకపోయినప్పటికీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి పార్లమెంటులో కొంత అస్తిత్వం ఉంది. ఆ రకంగా కేంద్రంలో పాలన సాగిస్తున్న భారతీయ జనతా పార్టీకి అప్పుడప్పుడూ వారితో అవసరం పడుతూ ఉంటుంది. అప్పుడు జగన్ నే వారు సంప్రదిస్తుంటారు. ఇది చాలా సహజం. అదేమీ ఆ రెండు పార్టీల మధ్య మైత్రీ బంధానికి, సుహృద్భావ వాతావరణానికి చిహ్నం అనుకోవడానికి వీల్లేదు. ఈ ఉదంతాల్ని పరిశీలించినప్పుడు.. జగన్ స్థాయి గతంలో కంటె ఇప్పుడు చాలా దయనీయంగా మారిపోయిందని మనకు అర్థమవుతోంది. ఎందుకంటే.. గతంలో పార్లమెంటులో జగన్ పార్టీ బలంతో అవసరం వచ్చినప్పుడు ఆయనకు కేంద్రంలో నెంబర్ 2 అమిత్ షా కాల్ చేసేవారు. మోడీ కాల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగిన నేపథ్యంలో జగన్ మద్దతు కోసం రాజ్ నాధ్ సింగ్ మాత్రమే ఫోను చేశారు. జగన్ విలువ పడిపోయిందనుకోవడానికి ఇదే నిదర్శనం అని పలువురు అనుకుంటున్నారు.
జగన్ పార్టీకి పార్లమెంటులో అంతో ఇంతో అస్తిత్వం ఉంది. లోక్ సభలో వైఎస్సార్ సీపీ తరఫున ఉన్నది నలుగురే. కానీ రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. ఆయన పార్టీకి మొత్తం బలం ఇంతకంటె ఎక్కువ ఉన్నా.. తక్కువ ఉన్నా.. ఆయన ప్రత్యేకంగా ఈ ఎన్నికలను ప్రభావితం చేయగలిగేంత నాయకుడు కానేకాదు. అయినా సరే రాజ్ నాధ్ సింగ్ ఫోను చేశారు.
ఒకప్పట్లో జగన్ కు రాజ్యసభలో జగన్ బలం కాస్త ఎక్కువగా ఉండేది. అప్పట్లో ఎన్డీయే కూటమికి రాజ్యసభ బలం తక్కువగా కూడా ఉండేది. ఏదైనీ కీలక బిల్లులు ఆ సభలో నెగ్గాలంటే వారికి అందరి మద్దతూ అవసరం అయ్యేది. అలాంటి సందర్భాల్లో నరేంద్రమోడీ, అమిత్ షా లు జగన్ కు ఫోను చేస్తుండేవారు. వారు అడిగినా అడగకపోయినా.. మద్దతు ఇవ్వడానికి వారిని ప్రసన్నం చేసుకోవడానికి సదా సిద్ధంగా ఉండే జగన్.. వెంటనే ఒప్పుకునే వారు. ఇప్పుడు జగన్ బలం కూడా పడిపోయింది. ఆయనను అడిగే నేతలు కూడా మారిపోయారు.
రాజ్ నాధ్ సింగ్ తక్కువ నాయకుడేమీ కాదు గానీ.. అమిత్ షా లాంటి నేత ఫోను చేసి ఉంటే గనుక.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ క్షణాన అరెస్టు అవుతాడో తెలియని భయంతో ఉన్న జగన్.. ఏదైనా సాయం అడిగి ఉండేవారని.. రాజ్ నాధ్ తో అలాంటి అవకాశం కూడా దక్కి ఉండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఉపరాష్ట్రపతి స్థానం ఖచ్చితంగా తాము గెలిచేదే అయినప్పటికీ.. బిజెపి దీనిని ఏకగ్రీవం చేసుకోవాలని అనుకుంటోంది. అందుకోసం కాంగ్రెస్ తో సహా విపక్షాలు అందరికీ ఫోను చేసే క్రమంలోనే రాజ్ నాధ్ జగన్ కు కూడా చేశారు తప్ప ప్రత్యేకత ఏమీ లేదని, ఆయన మద్దతు లేకపోయినా తాము గెలుస్తామని బిజెపి నాయకులు అంటున్నారు. కానీ.. జగన్ మాత్రం.. తన పార్టీ నేతలతో చర్చించి మద్దతిచ్చే విషయంలో అభిప్రాయం చెబుతానని రాజ్ నాధ్ తో అనడం విశేషం.
పాపం జగన్.. ఆ రకంగా ఆయన లెవిలు పడిపోయిందే!
Tuesday, December 9, 2025
