అన్నయ్య జైల్లో ఉంటే, ఆయన స్థాపించిన పార్టీ ఉంటుందో అంతరించిపోతుందో అనే భయాలు కేడర్ లో వ్యాపిస్తూ ఉండగా.. ఆమె నడుం బిగించి.. ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అని చెప్పుకుంటూ వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. రాజకీయంగా తాను అందలాలు ఎక్కడానికి జగన్మోహన్ రెడ్డి, చెల్లెలు షర్మిలను కరివేపాకులా వాడుకుని వదిలేసినప్పటికీ.. ఆమె మౌనంగానే ఉన్నారు. గిఫ్టు డీడ్ కింద తల్లికి ఇచ్చిన వాటాలు కూడా తిరిగి తనే కావాలంటూ జగన్ చవకబారుగా కోర్టుకు ఎక్కినప్పుడు తప్ప.. ఆమె ఆస్తుల సంగతి మాట్లాడలేదు. ఇద్దరికీ తండ్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కుటుంబానికి సమకూరిన ఆస్తులన్నీ తనకు మాత్రమే చెందుతాయని జగన్ అన్నా కూడా ఆమె నోరుమెదపలేదు. కానీ.. ఆమె తన మానాన తాను తెలంగాణ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పార్టీ పెట్టుకుని కష్టపడుతోంటే.. అక్కడ కూడా తన మీద అన్న సాగించిన కుట్రలు ఆమెను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. అప్పట్లో అక్కడ ఉన్న భారాస ప్రభుత్వంతో కుమ్మక్కు అయి.. షర్మిల ఫోనును ట్యాప్ చేయించి.. జగన్మోహన్ రెడ్డి.. ఆమె పతనానికి గోతులు తవ్విన వైనం తాజాగా వెలుగుచూడడం సంచలన పరిణామం. బుధవారం నాడు విశాఖపర్యటనకు వెళ్లనున్న ఏపీసీసీ సారధి వైఎస్ షర్మిల ఎయిర్ పోర్టులోనే ప్రెస్ మీట్ పెట్టి జగన్ మీద నిప్పులు చెరగనున్నట్టుగా.. తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. పదేళ్ల పాలన కాలంలో భారాస పాల్పడిన అరాచకాలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తూ వచ్చాయి. వీటన్నింటిలోనూ.. ఫోన్ ట్యాపింగ్ అనేది అతిపెద్ద నేరంగా పేరు తెచ్చుకుంది. పోలీసు శాఖలో కేసీఆర్ అనుకూలురైన ఉన్నతాధికారులు ఆయన కళ్లలో ఆనందం చూడడం కోసం రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసి వారి రహస్యాలను తెలుసుకుని, గులాబీ బాస్ కు చేరవేయడం పనిగా పెట్టుకున్నారు. దీనికోసం ఒక స్పెషల్ నెట్ వర్క్ ను నడిపించారు. అదే క్రమంలో భాగంగా.. అనేకమంది పారిశ్రామిక వేత్తలు, సినిమా ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తూ వారి ప్రెవేటు రహస్యాలను తెలుసుకుంటూ బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు దండుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
మొత్తం ట్యాపింగ్ దందాకు నేతృత్వం వహించిన కీలక నిందితుడు ప్రభాకర్ రావు అమెరికానుంచి తిరిగి వచ్చిన తర్వాత.. ఈ కేసు మరింత ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. గతంలో వైఎస్ షర్మిల ఫోన్ ను కూడా ట్యాప్ చేసి.. ఆమె ఫోను సంభాషణల రహస్యాలను, అప్పటికే ఆమెకు శత్రువుగా మారిన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తూ వచ్చారనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తెలంగాణను కుదిపేస్తున్న ట్యాపింగ్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి కూడా ఇరుక్కునే అవకాశం కనిపిస్తోంది. ఈ ట్యాపింగ్ సంగతి ముందే తెలిసినప్పటికీ.. నిరాధార ఆరోపణలుగా అందరూ కొట్టిపారేయకుండా వేచిచూసిన షర్మిల, ఇప్పుడు ఆధారాల సహా అన్న దుర్బుద్ధులపై దాడిచేయనున్నట్టు సమాచారం. బుధవారం విశాఖ వెళ్లనున్న ఆమె అక్కడినుంచే అన్న తన మీద చేసిన కుట్రల గురించి విమర్శలు సంధిస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పటికే అనేక కేసుల చిక్కుముడిలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు ఈ తెలంగాణ ఫోను ట్యాపింగ్ కొత్త తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది.
రేపే ముహూర్తం : జగన్ పై నిప్పులు చెరగనున్న షర్మిల!
Friday, December 5, 2025
