రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత బలమైన ఆల్‌టైం నాయకుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఖచ్చితంగా ఒకరు. అలాంటి రాజశేఖర రెడ్డి సొంత తమ్ముడిని.. అయినవాళ్లే అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అంతకంటె దగ్గరివాళ్లే తెరవెనుక నుంచి ఈ హత్యకు మార్గదర్శకత్వం వహించారు. ఇంతటి సంచలన హత్యలో.. ఆరు సంవత్సరాలుగా నేరనిర్ధారణ జరగడం లేదు. శిక్షలు పడడం లేదు. న్యాయవ్యవస్థతో ఆడుకోవడం, ఒక కేసు తుదివరకు తేలకుండా.. సాగదీయడానికి వక్రమార్గాలను అనుసరించడం అనేది ఈ కేసులో ప్రజలు గమనిస్తున్నారు. హత్య చేసిన ప్రధాన నిందితులు, వారి వెనుక ఉండి నడిపించిన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు అందరూ ప్రస్తుతం బెయిలు మీద బయటే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి బెయిలు రద్దుకోసం సుప్రీంలో నడిచిన పిటిషన్ వాదనల సందర్భంగా కొత్త పరిణామం వచ్చింది. ఆ ప్రకారం మహా అయితే మరో మూడునెలల వరకు ఈ నిందితులు సేఫ్ గా ఉండగలరని.. ఆ తర్వాత జైలుకు వెళ్లక తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
నిందితులందరూ బెయిలు మీదనే ఉండగా.. వివేకా కూతురు సునీత మాత్రం.. తన తండ్రి హత్య కేసు వెనుక విస్తృత కుట్ర కోణాల్ని వెలికి తీయడానికి దర్యాప్తు కొనసాగాల్సిన అవసరం ఉన్నదని అంటున్నారు. అయితే అందుకు ట్రయల్ కోర్టులోనే పిటిషన్ వేయాలని సుప్రీం తాజాగా ఉత్తర్వులు ఇవ్వడం.. నిందితులకు ప్రమాద సంకేతం అని చెప్పాలి. సునీత ట్రయల్ కోర్టులో పిటిషన్ వేయడానికి రెండువారాల గడువు ఇచ్చింది సుప్రీం కోర్టు. అలాగే.. ఆ పిటిషన్ లోని మెరిట్స్ ను పరిశీలించి ఏ సంగతి తేల్చడానికి ట్రయిల్ కోర్టుకు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. ఈ పర్వం మొత్తం పూర్తిఅయ్యేదాకా.. అంటే మూడునెలల తర్వాతకు బెయిళ్ల రద్దు అంశాన్ని వాయిదా వేసింది.
ఇప్పుడు బంతి ట్రయల్ కోర్టుకు వచ్చింది. విస్తృత కుట్రకోణం వెలికి తీయడానికి సీబీఐ దర్యాప్తు కొనసాగడం అవసరమే అని ట్రయల్ కోర్టు అనుమతిస్తే గనుక.. చాలా కీలక నిర్ణయం అవుతుంది. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి, ఆత్మీయుడు శివశంకర రెడ్డి తదితరుల బెయిళ్లు రద్దయ్యే అవకాశం ఉంది. అలాగే.. ఈ హత్యకు కుట్ర చేసిన వారిలో జగన్మోహన్ రెడ్డి, భారతి తదితరులు పాత్ర ఉన్నదా లేదా అనే విషయాలకు కూడా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది.
తన తండ్రిని హత్య చేసిన వాళ్లందరూ బెయిలుపై బయట హాయిగా తిరుగుతూ ఉంటే.. నేరస్తులను తేల్చాలంటూ.. తాను మాత్రం పనులు మానుకుని కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తున్నదని సునీత పలుసందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ట్రయల్ కోర్టు ఆమె పిటిషన్ పట్ల సానుకూలంగా స్పందిస్తే.. వివేకా హత్య వెనుక ఉన్నవారికంతా బ్యాడ్ డేస్ మొదలైనట్టే అవుతుంది.
వివేకా హంతకులకు మూడునెలలు నో ప్రాబ్లం!
Thursday, December 4, 2025
