రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక విచిత్రమైన రాజకీయ సారూప్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అధికారం పట్ల విపరీతమైన వ్యామోహం కలిగిన ప్రతిపక్ష పార్టీలు అచేతనమైన స్థితిలో రాజకీయాలు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలలోనూ ప్రతిపక్ష పార్టీల అధినేతలు అసలు ప్రజల్లోకి వెళ్లడాన్కి మరచిపోయారు. తాము ప్రజాస్వామ్యంలో ఉన్నామని.. ప్రతిపక్షం అంటే పాలక పక్షానికి వాచ్ డాగ్ లాంటిదని.. తాము నిత్యం ప్రజలలో ఉండి పోరాడితేనే సమాజానికి న్యాయం జరుగుతుందనే స్పృహను రెండు రాష్ట్రాలలోని రెండు పార్టీల అధినేతలు కోల్పోయారు. ప్రజల్లోకి కాదు కదా ఈ ఇద్దరు నేతలు ఒకే తీరుగా శాసనసభకు కూడా హాజరు కాకపోవడం విశేషం!
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి సారథి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా అసెంబ్లీకి రావడం తమ ప్రాథమిక బాధ్యత అనే సంగతిని మరిచిపోయారు. అది ఎలా ఉన్నప్పటికీ కనీసం ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలు తెలుసుకుంటూ ప్రభుత్వంలో ఉండే లోపాల పట్ల వారిని చైతన్య పరుస్తూ ముందుకు సాగడం కూడా వీరు విస్మరిస్తున్నారు. తెలంగాణ విషయానికొస్తే కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓడిపోయిన నాటి నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితం అయి ఉన్నారు. ఓడిపోయినప్పుడు బాత్రూంలో కాలు జారిపడి తుంటి ఎముక విరిగిన కేసీఆర్ గానీ, ఇప్పటిదాకా ప్రమాణ స్వీకారానికి మినహా అసెంబ్లీకి ఒకేసారి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇంచుమించుగా అదే తరహాలో ఇప్పటిదాకా ప్రమాణ స్వీకారం మినహా ఒకే సందర్భంలో అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు.
అయితే ఈ ఇద్దరు ప్రజల్లోకి వెళతాం.. వారితో కలిసి జీవిస్తాం.. అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారే తప్ప ఇంట్లోంచి అడుగు తీసి బయట పెట్టడం లేదు. 2024 డిసెంబర్ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జిల్లా యాత్రలలో ఉంటాయని ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటారని అంతకు రెండు నెలల ముందు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇప్పటికి మార్చి నెల కూడా పూర్తవుతున్నది గాని కెసిఆర్ ప్రజల్లోకి కాదు కదా అసెంబ్లీకి కూడా రావడం లేదు. అదే మాదిరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సంక్రాంతి తర్వాత వారానికి ఒక జిల్లా పర్యటించే లాగా ముమ్మరంగా ప్రజలలో గడుపుతానని అన్నారు. ఒకరోజు జిల్లా అంతా తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు రెండవ రోజు కార్యకర్తలతో ఆయా జిల్లా స్థాయి నాయకులతో సమావేశం అవుతూ మార్గదర్శనం చేస్తారని జగన్మోహన్ రెడ్డి గత ఏడాదిలోనే ప్రకటించారు. సంక్రాంతి గడిచిపోయింది- ఉగాది కూడా వస్తున్నది కానీ జగన్ మాత్రం ఇల్లు దాటి బయటకు అడుగు పెట్టలేదు.
ఈ కోణంలోంచి చూసినప్పుడు.. ఈ ఇద్దరు నాయకులు కూడా ఒకే తీరుగా వ్యవహరిస్తున్నారని.. ఇంట్లోంచి బయటకు కదలకుండా ఈగోతో కూడిన రాజకీయం చేస్తున్నారని.. మనకు అర్థం అవుతుంది.
జనంలోకి వెళ్లడంలో ఆ ఇద్దరూ దొందూ దొందే !
Saturday, March 22, 2025
