జనసేన అనే పవన్ కళ్యాణ్ ఈదఫా తొలి నుంచి కూడా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంతో.. చంద్రబాబు నాయుడు నాయకత్వం కింద పనిచేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తూ వచ్చారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా.. కూటమి బంధం చెడకుండా.. సీట్ల విషయంలో పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తులు వచ్చినా కూడా తానే వారికి సర్ది చెప్పుకుంటూ.. ఎన్నికల సమరంలో నిలిచారు. అలాంటి సర్దుబాటు ధోరణి ఫలితమే ఎన్డీఏ కూటమి అపురూపమైన విజయాన్ని నమోదు చేయడం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటివరకు కూడా అదే స్నేహపూర్వక సర్దుబాటు ధోరణి అవలంబిస్తూ కూటమి దృఢత్వానికి మరింత బలంగా నిలుస్తున్నారు.
తాజాగా ‘స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరిట నిర్వహించిన గ్రామ సభలలో జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడి సేవలు, ఆలోచనలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అవసరం అని తాను మొదటి నుంచి నమ్ముతున్నానని పేర్కొన్నారు. తనకంటే గొప్పగా ఆలోచించగలిగిన వారి కింద పనిచేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని పవన్ చెప్పారు. సమర్ధుడైన నాయకుడిగా పనిచేయడం చంద్రబాబు నుంచి నేర్చుకోవాలని ఉందనే అభిలాషను కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు.
నిజానికి ఇది చాలా మంచి ధోరణి. ఒకసారి ఎన్నికలలో గెలిచిన వెంటనే నాయకులు తమకు కొమ్ములు మొలిచినట్లుగా భావించుకుంటూ.. పెడసరంగా ప్రవర్తిస్తూ ఉండే ఈ రోజుల్లో.. తన పార్టీ తరఫున 100 శాతం స్థానాలను గెలుచుకొని అపురూపమైన రికార్డు నమోదు చేసిన పవన్ కళ్యాణ్ ఇంత వినయంగా మాట్లాడడం అభినందనీయమైన సంగతి. చంద్రబాబు నాయుడు నుంచి పనిచేయడం నేర్చుకోవాలని ఉందని ఆయన ధోరణి కూటమి ఐక్యతకు మేలు చేస్తుంది.
చంద్రబాబు నాయుడు కూడా డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కు అపరిమితమైన గౌరవం ఇస్తున్నారు. ప్రతి విషయంలోనూ సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఇరువురి నాయకులు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటున్న తీరు అద్భుతంగా ఉంటోంది. ఇలాంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరింత బలంగా ఉండడం మాత్రమే కాదు- రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు కూడా వడివడిగా పడతాయని ప్రజలు ఆశిస్తున్నారు.