ఈ విపత్తు గడిచి బయటపడతామా లేదా అని భయపడుతూ బతికిన రోజుల నుంచి జనజీవితం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నది. ప్రజాజీవనాన్ని స్తంభింపజేసిన విషయాలను ఒక్కటొక్కటిగా తిరిగి చక్కదిద్దుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంకా స్వయంగా క్షేత్రస్థాయిలోనే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. అన్నింటికంటె హైలైట్ ఏంటంటే.. నిర్వహణ సరిగా లేకపోవడం వలన ఏ బుడమేరుకు గండిపడి ఒకటిన్నర లక్షలర ఇళ్లు నీట మునిగిపోయాయో.. ఆ బుడమేరు గండ్లు పూడ్చడానికి ప్రత్యేకంగా ఆర్మీని రప్పిస్తున్నట్లుగా చంద్రబాబునాయుడు వెల్లడించడం. ఈ స్థాయిలో సహాయక చర్యలు, పునరుద్ధరణ చర్యలు చేపట్టడం అనేది కేవలం రాష్ట్రంలో ఎన్డీయే కూటమి నేతృత్వంలోని డబల్ ఇంజిన్ సర్కార్ ఉండడం వల్ల మాత్రమే సాధ్యమవుతోందని పలువురు ప్రశంసిస్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరా చాలా వరకు పునరుద్ధరించినట్లుగా సీఎం చెప్పారు. పారిశుధ్య పనులు కూడా వేగంగా చేయిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అగ్నిమాపక శకటాలను విజయవాడ రప్పించి.. వాటితో వరద ప్రాంతాలను శుభ్రం చేసే పనులు ప్రారంభించారు. ఇంకా పొరుగు రాష్ట్రాలనుంచి కూడా అగ్నిమాపక వాహనాలు తెప్పిస్తున్నట్టుగా చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ప్రత్యేకించి.. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉండడం వలన అదనపు ప్రయోజనాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వరద జనజీవితాన్ని ముంచెత్తినప్పుడు.. ఒకవైపు భారీ వర్షాలు కురుస్తూనే ఉండగా.. అప్పటికప్పుడు చేయగలిగింది ఏమీ లేకపోయినప్పటికీ.. మరునాడు ఉదయానికెల్లా నేవీకి చెందిన హెలికాప్టర్లు రంగంలోకి దిగడం అనేది చిన్న సంగతి కాదు. తెల్లవారుజాము నాలుగు గంటల వరకు రాత్రంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో బోట్ల మీద తిరుగుతూనే ఉండి.. ప్రజలకు ధైర్యం చెప్పిన చంద్రబాబు చెప్పినట్టే ఉదయానికెల్లా హెలికాప్టర్లు వచ్చాయి. అలాగే ఎన్డీఆర్ఎఫ్ నుంచి అదనపు బృందాలు కూడా వచ్చి ఏపీలో సేవలు అందించాయి. సాధారణ హెలికాప్టర్లతో పని జరగదని తెలిసినా కూడా.. ముందురోజు హెలికాప్టర్లు పెట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యం అన్నట్టుగా.. వైసీపీ నాయకులు చాలా సంకుచితంగా ఆరోపించారు కూడా.
చంద్రబాబునాయుడు అమిత్ షా తో ఫోనులో మాట్లాడాక.. ఇక్కడి పునరుద్ధరణ పనులు, నష్టం అంచనాలకోసం కేంద్ర నిపుణుల బృందం కూడా రాబోతోంది. ఇప్పుడు బుడమేరు గండ్లు పూడ్చడానికి ఏకంగా.. ఆర్మీ రంగంలోకి దిగుతున్నదంటే.. అంతకుమించి.. ఏ ప్రభుత్వమూ ఏమీ చేయలేదని ప్రజలు ప్రశంసిస్తున్నారు.