చంద్రబాబును ‘టార్చ్ బేరర్’ అనేది అందుకే!

Wednesday, February 19, 2025

‘‘మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి.. మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి.. వెనుక వచ్చు వాళ్లకు బాట అయినది.. ’’ అని రాస్తారు సిరివెన్నెల సీతారామశాస్త్రి అంకురం చిత్రం కోసం ఒక పాటలో. మొదటి అడుగు వేసే వారినే టార్చ్ బేరర్స్ అంటారు.. తమ తర్వాతి తరాలకు ఒక పథ నిర్దేశం చేసేవాళ్లే ఇలా మొదటి అడుగు వేయడానికి సాహసిస్తారు. నాలుగు దశాబ్దాలు పైబడిన రాజకీయ జీవితంలో.. నాలుగుదఫాలుగా ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్న నారా చంద్రబాబునాయుడు అనేక విషయాల్లో పరిపాలన అంశాలలో తనను తాను టార్చ్ బేరర్ గా నిరూపించుకున్న సంగతి ప్రజలకు తెలుసు. తాజాగా ఇప్పుడు కూడా.. ఆయన పౌరులకు సేవలందించడంలో అత్యంత సులువైన రీతిలో వాట్సప్ ద్వారా 161 రకాల పౌర సేవలను అందించే సరికొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నారు. హైటెక్ జీవితాన్ని, ఆధునిక సాంకేతికత ద్వారా ప్రజల జీవితాలకు మెరుగ్గా, సునాయాసంగా సేవలందించడంలో ఇది ఒక విప్లవం.
ఇవాళ్టి రోజుల్లో స్మార్ట్ ఫోను లేని వ్యక్తులు ఉండడం లేదంటే.. అతిశయోక్తి కాదు. ఏ స్మార్ట్ ఫోను వినియోగం అయితే.. ధనిక పేద తారతమ్యాలు గానీ,  మారుమూల గ్రామాలనే వ్యత్యాసాలు గానీ లేకుండా జనజీవితాల్లోకి చొచ్చుకుపోయిందో.. అదే స్మార్ట్ ఫోను ఆధారంగా, అందులో దాదాపు 90 శాతం మంది వినియోగదారులు వినియోగిస్తూ ఉండే వాట్సప్ ద్వారానే ప్రభుత్వ సేవలు అన్నింటినీ దాదాపుగా ప్రజలకు అందించడానికి ప్రభుత్వం ఈ కొత్త విధానం తీసుకు వచ్చింది.

ప్రజాపరిపాలనలోనే ఇది ఒక నవశకం అని చెప్పాలి. దీనికోసం ప్రభుత్వం ఒక అధికారిక వాట్సప్ నెంబరును ప్రకటిస్తుంది. అది వెరిఫైడ్ నెంబరుగా బ్లూటిక్ తో వస్తుంది. ఈ మేరకు వాట్సప్ ద్వారా పౌరసేవలు అందించడానికి మెటాతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పర్యాటక ప్రదేశాలు, ఆలయాలలో టికెట్లు బుక్ చేసుకోవడం దగ్గరినుంచి, గదులు బుక్ చేసుకోవడం వరకు, రెవెన్యూ కార్యాలయాల్లో అవసరమైన ధ్రువపత్రాలు పొందడం, ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్ చేసుకోవడం, కరెంటు బిల్లులు చెల్లించడం ఇలాంటి సకల అవసరాలను వాట్సప్ ద్వారానే ప్రజలు తీర్చేసుకోవచ్చు. తమ సమస్యలను ప్రభుత్వానికి నివేదించడానికి కూడా వాట్సప్ ద్వారా సాధ్యమవుతుంది. ప్రతి సమస్యను నివేదించినప్పుడు.. ఒక నెంబరు వస్తుంది.. ఆ నెంబరు ద్వారా.. తమ సమస్య గురించిన ప్రభుత్వం చర్యలు ఏ దశలో ఉన్నాయో ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ తెలుసుకోవచ్చు కూడా. మొత్తానికి ప్రభుత్వంతో ప్రజలకు ఉండే అనేక అవసరాలను వాట్సప్ ద్వారానే చక్కదిద్దుకునేలా రూపుదిద్దారు.
పరిపాలనలో వాట్సప్ గవర్నెన్స్ అనేది ఒక సరికొత్త విప్లవంగా నిలుస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. వాట్సప్ ప్రభుత్వ నెంబరును ప్రజలందరూ ఏకకాలంలో యాక్సెస్ చేసినా కూడా టెక్నికల్ ఇబ్బంది రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఎలాంటి చికాకులు లేకుండా ప్రజలు వినియోగించుకుంటారని భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles