ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అని పిలుపునిచ్చామని… ప్రజలు గెలిచి కూటమిని గొప్ప స్థానంలో నిలబెట్టారని ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రస్తుతం ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. శ్వేతపత్రాల ద్వారా ఆయా శాఖల గురించి ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని, బాధ్యతలేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు వివరించి చెబుతున్నామని తెలిపారు.
“విద్యుత్ తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది. విద్యుత్ రంగంపైనే ప్రజల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉన్నాయి. 2014లో తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంది. ఈ ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. అసమర్థులు పాలన చేస్తే ఇలాగే ఉంటుందని ఆయన మండిపడ్డారు.
నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. కానీ, ఇంత భారీ స్థాయిలో విద్యుత్ రంగ వ్యవస్థలు దెబ్బతిన్న సందర్భం నేను రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదు. 2014లో 22.5 మిలియన్ల యూనిట్ల కరెంటు కొరత ఉంటే దాన్ని కేవలం 3 నెలల్లో అధిగమించాను. అక్కడ్నుంచి సంస్కరణలు తీసుకువచ్చి, మిగులు విద్యుత్ సాధించాం. 1994-95లో దేశమంతా విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది. ఆ తర్వాత మేం విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చాం. 2004 నాటికి మిగులు విద్యుత్ ని సాధించాం.
ఈరోజు పరిస్థితి ఏంటంటే… అన్ని సంస్థలకు అప్పులు కట్టాలి, దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన పరిస్థితి, ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు భారం లేకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఓ పక్కన చూస్తే మా ప్రభుత్వం మోయలేనంత భారం… మరోపక్కన చూస్తే మాపై ప్రజల్లో నమ్మకం, అభిమానం! ఈ రెండింటిని బ్యాలన్స్ చేసుకుంటూ, ప్రజలందరి నుంచి సూచనలు అందుకుని ముందుకు వెళతాం. భవిష్యత్ లో విద్యుత్ ఆధారిత వాహనాలు పెరుగుతాయి… ఆ మేరకు విద్యుత్ ఉత్పాదన కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వివరించారు.