చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల మీద, వారి ప్రభుత్వ హయాంలో కీలక స్థానాల్లో పనిచేసిన అధికారుల మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని.. జగన్ అండ్ కో చాలా తరచుగా ఆరోపిస్తూ ఉంటారు. కానీ ఆ ఆరోపణలన్నీ అబద్ధాలని, జగన్ ప్రభుత్వంతో అంటకాగిన అధికారుల్ని కూడా.. వారి పూర్వ ట్రాక్ రికార్డును దృష్టిలో పెట్టుకుని చాలా గౌరవంగా ప్రభుత్వం చూస్తున్నదని తాజాగా నిరూపణ అవుతోంది. జగన్ సర్కారులో కీలక పదవులు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ శనివారం పదవీ విరమణ చేస్తుండగా.. ఆయనను సగౌరవంగా సాగనంపేందుకు, పదవీవిరమణకు కేవలం ఒక్కరోజు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు పోస్టింగు ఇచ్చింది. తద్వారా తప్పులు చేసిన వారికి దండన ఉంటుందే తప్ప.. తమ ప్రభుత్వ హయాంలో అధికారుల మీద కక్ష సాధింపు ఉండదని సర్కారు నిరూపించుకుంటున్నది.
రజత్ భార్గవ సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయన వైఎస్ జగన్ హయాంలో కూడా పలు కీలక పదవులు నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలోని పెద్దలతో సన్నిహితంగా మెలిగారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనను వెయిటింగ్ లో పెట్టారు. కానీ శనివారం పదవీ విరమణ సందర్భంగా సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగు ఇచ్చారు. ఆ హోదాలోనే ఆయన పదవీ విరమణ చేస్తారు. ఆయనకోసం.. ఆ హోదాలో ప్రస్తుతం ఉన్న పోలాభాస్కర్ ను పక్కకు తప్పించారు. రజత్ భార్గవ పదవీ విరమణ తర్వాత భాస్కర్ మళ్లీ అదే పదవిలోకి వస్తారు. రజత్ భార్గవ ఈ అయిదేళ్లు జగన్ ప్రభుత్వంతో అంటకాగినా.. అదివరలో వివిధ హోదాల్లో రాష్ట్రానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఐఏఎస్ అధికారులు కీలకస్థానాలకు ఎదిగేకొద్దీ.. ఆయా ప్రభుత్వాల ముద్ర వారిమీద పడడం సహజం. కానీ వారు తామరాకుపై నీటిబొట్టులా వ్యవహరిస్తే ఏ ఇబ్బందీ ఉండదు. అలాకాకుండా పార్టీ రంగులు పులుముకుంటేనే ప్రభుత్వాలు మారితే వారిని టార్గెట్ చేస్తాయి. సాధారణంగా ఐఏఎస్ అధికారులు పోస్టింగులేకుండా పదవీవిరమణ చేయడాన్ని అవమానంగా భావిస్తారు. చంద్రబాబు కొలువుతీరిన తర్వాత.. జగన్ అరాచకాలలో భాగస్వామి అయిన అప్పటి సీఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టారు. ఆయన పోస్టింగు లేకుండానే పదవీవిరమణ చేయాల్సి వచ్చింది. కానీ రజత్ భార్గవ విషయంలో ఆయన ట్రాక్ రికార్డు వల్ల గౌరవంగా రిటైరయ్యేలా పోస్టింగు ఇచ్చి, తాము కక్ష సాధింపులకు పాల్పడే వారం కాదని నిరూపించుకున్నారు.
కక్షసాధింపులు లేవనడానికి ఇదే రుజువు!
Friday, December 27, 2024