‘నేను ముఖ్యమంత్రిని.. విపరీతమైన కార్యభారం నడుమ, రాష్ట్ర పరిపాలన బాధ్యతల నడుమ ఒత్తిడిలో ఉంటాను. నాకు సమయం ఉండదు. కాబట్టి కోర్టు వాయిదాలకు హాజరు కాలేను’ అని వేల కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో ఏ1 నిందితుడు కోర్టుకు నివేదించుకుంటూ.. అయిదేళ్ల పాటూ ఒక్క వాయిదా కూడా హాజరు కాకుండా తప్పించుకుంటూ వచ్చారు. ప్రతిశుక్రవారం ఉండే సీబీఐ కోర్టు విచారణలకు ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు హాజరు కాలేదు. ఈ స్వేచ్ఛను అనుభవించడంలో ఈ శుక్రవారం బహుశా ఆయనకు చిట్టచివరిది కావొచ్చు. ఈ రోజు నాటికి.. నేను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నానని ఆయన బుకాయించి గైర్హాజరు కాగలరు గానీ.. వచ్చే శుక్రవారం నాటికి ఆయన మాజీ అవుతారు. కేవలం ఒక మాజీ ఎమ్మెల్యే. కేబినెట్ మంత్రి హోదా మరియు ప్రోటోకాల్ మర్యాదలు ఉండగల ప్రధాన ప్రతిపక్ష నేతగా తనను తాను అభివర్ణించుకునే పరిస్థితి కూడా ఆయనకు లేదు. కాబట్టి.. వచ్చే వారం నుంచి ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో.. క్విడ్ ప్రోకోకు పాల్పడి జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టుగా అప్పట్లో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో ఆధారాలు స్పష్టంగా నిరూపణ కావడంతో.. జగన్మోహన్ రెడ్డి అరెస్టు అయి సుదీర్ఘకాలం జైల్లో గడిపారు కూడా. బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రతి శుక్రవారం విచారణలు జరుగుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి హాజరవుతూ వచ్చారు.
2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఆయన ఈ శుక్రవారం హాజరు నుంచి తప్పించుకోగలిగారు. ముఖ్యమంత్రిగా పనుల ఒత్తిడిలో ఉంటాను గనుక.. తనకు హాజరు కావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అప్పటినుంచి యథేచ్ఛగా గైర్హాజరు అవుతున్నారు. కానీ జగన్ జీవితంలో ఆ స్వర్ణయుగం ఇప్పుడు గతించిపోయింది. ఇది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చివరి శుక్రవారం! వచ్చే శుక్రవారానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటారు. కోర్టుకు రాలేను అని తప్పించుకోవడానికి కుదర్దు. ఇక ప్రతిశుక్రవారం జగన్ హైదరాబాదు వచ్చి సీబీఐ కోర్టు ఎదుట హాజరు అవుతూ ఉండాల్సిందేనన్నమాట.
జగనన్నయ్యకు ఇది చివరి శుక్రవారం!
Thursday, November 21, 2024