తిరుపతి ప్రపంచంలోనే అతిప్రసిద్ధ పుణ్యక్షేత్రం గనుక.. రోజూ లక్షల మంది యాత్రికుల తిరుపతి క్షేత్రానికి వచ్చివెళుతూ ఉంటారు గనుక అక్కడ చేతివాటం ప్రదర్శించే దొంగలు పుష్కలంగా ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే వ్యాపారాల ముసుగులో మోసాలు కూడా విచ్చలవిడిగా ఉంటాయంటే కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ.. రాష్ట్రంలోనే దొంగ ఓట్లకు కూడా తిరుపతి అడ్డాగా మారుతోంది. ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఏకంగా 38,493 దొంగ ఓట్లు ఉన్నాయంటే ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలుగుతుంది. ఈ దొంగ ఓట్లు కదా.. చట్టసభ ప్రతినిధిని నిర్ణయించబోయేది అనే భయం అది. అందుకే ఇక్కడి దొంగ ఓట్లును పూర్తిగా ఏరివేయాలని, ఏరివేత పూర్తయిన తర్వాతనే తిరుపతిలో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పుడు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగిన సందర్భంలో చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ దొంగ ఓట్లు నమోదు అయ్యాయి. ఎన్నికల అధికారి ఈఆర్‌వో లాగిన్ ను ఉపయోగించి వేల సంఖ్యలో ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి వాటిలో ఫోటోలు మార్చి రకరకాల అక్రమాలకు పాల్పడడం ద్వారా… చరిత్ర సృష్టించారు. నిజానికి వైసీపీ ఎంపీ మరణం కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో అధికార పార్టీకే ఎడ్వాంటేజీ ఉన్నప్పటికీ.. పనిగట్టుకుని వేలాది దొంగఓట్లను నమోదు చేయించి ఓట్లు వేయించారు. ఆ తర్వాత.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విచ్చలవిడిగా దొంగఓట్లు పడడం, ఎలిమెంటరీ స్కూలు చదువు లేని వారు కూడా, అసలు ఏ ఎన్నికకు ఓటు వేస్తున్నామో కూడా తెలియకుండా క్యూలైన్లో వచ్చి ఓట్లు వేయడం ప్రజలు గమనించారు. ఈ నేపథ్యంలో వెల్లువెత్తిన ఫిర్యాదుల మీద స్పందించిన ఈసీ అనేక మంది అధికారుల మీద వేటు వేసింది. దొంగ ఓట్ల బాగోతం మొత్తం నిజమే అని తేల్చింది. అప్పట్లో తిరుపతి కమిషనర్ గా ఉన్న గిరీశ మీద కూడా వేటు పడగా, ఆయన సరైన సంజాయిషీ ఇచ్చుకుని వేటు తప్పించుకున్నారు.
అయితే అప్పట్లో నమోదైన దొంగఓట్లే ఇంకా కొనసాగుతున్నాయని, అతిజాగ్రత్తగా వాటన్నింటినీ ఏరివేయాల్సిన అవసరం ఉన్నదని తిరుపతి బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి కోరుతున్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాకు వినతిపత్రం ఇచ్చారు. ప్రజాస్వామ్యం బతకాలంటే.. ముందు దొంగఓట్లు ఏరివేయాలని, ప్రతి బూత్ కు ఇద్దరు రెవెన్యూ అధికారుల్ని నియమించి.. దొంగఓట్లను జాబితానుంచి తొలగించాలని అంటున్నారు. అదే జరగకపోతే ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతుందని అంటున్నారు. అవసరమైతే తిరుపతి అసెంబ్లీ ఎన్నికను చివరివిడతకు వాయిదా వేసి అయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు. మరి ఎన్నికల అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
దొంగ ఓట్ల అడ్డా తిరుపతి.. ఏంటి దారి?
Thursday, November 21, 2024