దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్వయంగా పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 243 స్థానాల్లోనూ తన పార్టీ తరఫున అభ్యర్థులను మోహరించనున్నట్లుగా ప్రశాంత్ కిషోర్ తాజాగా ప్రకటించారు. ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్త ప్రాచుర్యం సంపాదించిన తర్వాత తనలోని రాజకీయ ఆసక్తిని కొన్ని సంవత్సరాలుగా బయట పెట్టుకుంటూనే ఉన్న ప్రశాంత్ కిషోర్.. అక్టోబర్ రెండవ తేదీన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ కొన్నాళ్లుగా బీహార్ వ్యాప్తంగా ‘జన సురాజ్’ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఆ యాత్ర పేరునే రాజకీయ పార్టీగా మార్చబోతున్నారు.
ప్రశాంత్ కిషోర్ ఒకప్పట్లో నరేంద్ర మోడీకి, తర్వాత కాలంలో కాంగ్రెస్ ఎస్పీలకు, మమతా బెనర్జీకి, జగన్మోహన్ రెడ్డికి తదితర ప్రముఖుల అందరికీ కూడా రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తూ వచ్చారు. 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన తర్వాత.. ఇక వ్యూహకర్త పనుల నుంచి తప్పుకుంటున్నానని కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమవుతానని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు. బీహార్లో ఒకప్పట్లో ఆయన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు చాలా సన్నిహితంగా మెలిగారు.. నితీష్ కుమార్ పార్టీ జేడీయులో దాదాపుగా నెంబర్ టూ లాగా వెలుగొందారు. ఒక దశలో నితీష్ కుమార్ తన రాజకీయ వారసుడిగా ప్రశాంత్ కిషోర్ ను ప్రకటించారు కూడా! ఆ తర్వాత ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి. నితీష్ పోకడలను ప్రశాంత్ కిషోర్ తీవ్ర స్థాయిలో విమర్శించడం ప్రారంభించారు. నితీష్ ప్రభుత్వాన్ని పతనం చేస్తానని కూడా ఆయన ప్రతిజ్ఞ చేశారు. సొంతంగా రాజకీయ పార్టీ ఆలోచన పాతదే అయినప్పటికీ.. అక్టోబర్ 2న ప్రారంభించబోతుండడం ఒక ఎత్తైతే.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున కనీసం 40 మంది మహిళలకు టికెట్లు ఇవ్వబోతున్నట్లుగా పీకే తాజాగా ప్రకటించడం గమనార్హం. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం ఇంకా పెరగాల్సి ఉందంటున్న ప్రశాంత్ కిషోర్.. 2030 ఎన్నికల నుంచి తమ పార్టీ తరఫున కనీసం 70-80 మంది మహిళా అభ్యర్థులను బరిలో నిలుపుతామన్నారు. నిజానికి అప్పటికి చట్టసభలలో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్ అమలులోకి వచ్చేస్తుంది కనుక.. పీకే ప్రత్యేకంగా చేసేదేమీ లేదు. ఆ దామాషాలో మహిళలకు టికెట్లు ఇచ్చి తీరాల్సి వస్తుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ వ్యవధి ఉండగా పార్టీని ప్రకటించబోతున్న ప్రశాంత్ కిషోర్.. తాము అధికారంలోకి రాగలమని ధీమా వ్యక్తం చేస్తుండడం విశేషం. జన సురాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీహార్ ప్రజలు బతుకుతెరువు కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళబోరు అని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. మరి ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతుందో వేచి చూడాలి.