ఆయన మామూలు మనుషుల కంటే చాలా గొప్పవారు. మామూలు మనుషులకు వర్తించే చట్టాలు, న్యాయాలు, రాజ్యాంగ నియమ నిబంధనలు తనకు వర్తిస్తాయని అంటే ఆయన ఒప్పుకోరు. అవన్నీ సామాన్యుల కోసం కదా.. నేను వారి కంటే గొప్పవాడిని కదా అని బహుశా వాదిస్తారు. సామాన్యులకు శిక్షలు వేసే కోర్టు, తన కేసులను కూడా పరిశీలిస్తే తనకు అవమానం జరిగినట్లుగా భావిస్తారో ఏమో తెలియదు. అందుకే ఆర్థిక నేరాలను విచారించే సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిచి ప్రశ్నలు అడిగితే, డొంక తిరుగుడు జవాబులు చెప్పిన విజయసాయిరెడ్డి తన మీద ఆరోపణలు చేసిన వారు తిరుమలకు వచ్చి మాట్లాడాలని, ప్రమాణాలు చేయాలని తప్పు ఎవరిది అయితే వారిని దేవుడే శిక్షిస్తాడని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు.
కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ కు చెందిన కర్నాటి వెంకటేశ్వరరావు అనే కె.వి.రావును బెదిరించి 3600 కోట్ల రూపాయల విలువైన వాటాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాగిరీతో చేజిక్కించుకున్నారు- అనేది ఆరోపణ! కె.వి.రావును బెదిరించి ఒత్తిడి చేయడంలో విజయసాయి రెడ్డి పాత్ర ఉందని, ఆయన సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడిటింగ్ సంస్థ అక్రమాలు కూడా అనేకం ఉన్నాయని, మనీ లాండరింగ్ వ్యవహారాలు బయటపడ్డాయని గుర్తించిన తర్వాత రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చింది. మొత్తానికి వారు విజయసాయిరెడ్డిని హైదరాబాదులోని కార్యాలయానికి పిలిపించి విచారించారు.
కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకులందరికీ అలవాటైన ధోరణిలోనే తెలియదు.. గుర్తులేదు.. మరిచిపోయా.. వంటి సమాధానాలతో పాటు అనేక బుకాయింపు మాటలు చెప్పిన విజయసాయిరెడ్డి అసలు కె.వి రావు ఎవరో తనకు తెలియనే తెలియదంటూ పేర్కొనడం విశేషం. ఫోన్ చేసి ఒత్తిడి చేసినట్లుగా తన మీద ఆరోపణలు చేస్తున్న కేవీ రావు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి, అక్కడ చెప్పాలని ప్రమాణాలు చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఆయన చెప్పినట్లు జరిగితే దేవుడు విధించే ఏ శిక్షకైనా తాను సిద్ధమేనని విజయసాయి చెబుతున్నారు. అంటే తనకు శిక్షలు విధించడానికి ఈడి గాని, న్యాయస్థానాలు గాని చాలవు అని విజయసాయిరెడ్డి ఇండైరెక్టుగా సూచిస్తున్నట్లుగా ఉంది. ఒకవేళ కె.వి. రావు ఆరోపణలు అవాస్తవాలని తేలితే ఆయన్ని దేవుడే శిక్షిస్తాడని కూడా విజయసాయిరెడ్డి సానుభూతి చూపిస్తున్నారు. నిజానికి కె.వి. రావు తన వాటాలను కోల్పోవడం ద్వారా ఆల్రెడీ వైసిపి వారి దందాలకు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. ఇంకా కొత్తగా ఆయనకు పడే శిక్ష ఏముంటుంది? విజయసాయిరెడ్డిని దేవుడే శిక్షించాలి అని ఎదురుచూస్తూ కూర్చోవాలా? రాజ్యాంగం, చట్టాలు అన్నీ పనికిరానివి అంటున్నట్టేనా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు!
వారెవ్వా విజయసాయికి దేవుడి కోర్టు కావాలంట!
Wednesday, January 8, 2025