ఊడ్చుకుపోయిన చోటే.. శంఖం ఊదుతారట!

Friday, December 5, 2025

ఒక్కసారి అధికారం దక్కితే.. ఎంతటి విధ్వంసకరమైన పాలన అందించగలరో.. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రప్రజలకు అయిదేళ్లపాటు రుచిచూపించారు. ఆ పాలనతో విసిగి వేసారిపోయిన ప్రజలు జగన్ ను కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. జగన్ తన పాలనలో విభజించిన కొత్త జిల్లాలు కాదు కదా.. అదివరకు ఉన్న జిల్లాల సంఖ్యతో పోలిస్తే.. సగటున జిల్లాకు ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీ తరఫున గెలవలేదు. అనేక జిల్లాల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. అలాంటి వాటిలో ఉభయగోదావరి జిల్లాలు కూడా ఉన్నాయి. అయితే.. ఎక్కడైతే తన పార్టీ సమూలంగా తుడిచిపెట్టుకుపోయిందో.. అక్కడినుంచే రాబోయే ఎన్నికలకు సమరశంఖం పూరించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అవుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఏడాది జులై 8వ తేదీన ఉభయగోదావరి జిల్లాలు వేదికగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించడానికి నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ప్లీనరీని చాలా ఘనంగా జరుపుకుందాం అని.. రాబోయే ఎన్నికలకు శంఖారావం కూడా ఆ వేదికమీదినుంచే పూరిద్దాం అని.. జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల సమావేశంలో ప్రకటించారు. అయితే ఆ ప్లీనరీకి వేదిక ఉభయగోదావరి జిల్లాలే అని తెలుస్తోంది.

పోగొట్టుకున్న చోటనే వెతకాలి అనే సామెత చందంగా.. ఎక్కడ తన పార్టీ ఒకప్పుడు వైభవస్థితిని అనుభవించి, ఆ తర్వాత సర్వభ్రష్టత్వం చెందిపోయిందో… అదే ప్రాంతంలో తిరిగి వైభవం సంపాదించుకోవాలని జగన్ ఆరాటపడుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ‘ఇక్కడినుంచే ఎందుకు?’ అనే ప్రశ్నకు పార్టీ వర్గాల ద్వారా వినవస్తున్న కారణం మాత్రం చిత్రమైనది.
ఉభయగోదావరి జిల్లాల్లోని ఒక ప్రాంతంలో జగన్ ప్లీనరీ పెట్టుకుంటే మంచిదే. అక్కడి ప్రజల ఆదరణ చూరగొనేలాగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించి.. ప్రజలు తనను అభిమానిస్తున్నారని.. తిరిగి సీఎం కావడానికి ఆ ఆదరణను వాడుకోవాలని ఆయన పార్టీలో జోష్ కోసం అక్కడ ప్లీనరీ అనుకుంటే మంచిదే.

కానీ.. కూటమి పార్టీలు అక్కడ బలంగా ఉన్నాయని, వాటి మధ్య ఇప్పుడిప్పుడే ఆ జిల్లాల్లోని నాయకుల మధ్య పొరపొచ్చాలు, విభేదాలు పొడసూపుతున్నాయని, వారి విభేదాలను తన పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలనే దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్లీనరీ పెట్టాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కూటమి పార్టీల మధ్య ఉభయగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల విభేదాలు ఉండవచ్చు గాక.. కానీ.. అవన్నీ కూటమి అంతర్గత వ్యవహారాలు. బయటి శత్రువుతో పోరాడేప్పుడు వారంతా ఐక్యంగానే ఉంటారు. ఆ సూత్రం తెలియకుండా.. వారి విభేదాలను నమ్ముకుని జగన్ గోదారి జిల్లాల్లో తన కుటిల రాజకీయం చేయాలని చూస్తే తల బొప్పి కడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles