‘మార్కెట్ కు వెళ్లి కిలో టమోటా తీసుకురండి’ అని చెప్పినంత ఈజీగా.. 24వ తేదీన దేశంలోని అన్ని పార్టీల వారిని కూడా తీసుకురండి.. అని జగన్ చాలా సింపుల్ గా తన పార్టీ ఎంపీలకు పురమాయించేశారు. ఆ బాధ్యతతో ఇప్పుడు వారికి చచ్చిన చావు వచ్చి పడింది. మా నాయకుడు ధర్నా చేస్తాడు మీరు కూడా రండి సార్ అని అడగడానికి వెళ్లినా, ఫోన్లు చేస్తున్న దేశంలోని ఇతర పార్టీల నాయకులు మొహం చాటేస్తున్నారు. దేశంలోని ప్రధాన పార్టీల వారు ఎవరైనా జగన్ ధర్నాకు మద్దతు గా తరలివస్తే పరవాలేదు.. లేకపోతే తమ నాయకుడు అలుగుతాడని వారు భయపడుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అంతా సర్వనాశనం అయిపోతున్నదని, హింస చెలరేగుతున్నదని రకరకాల ఆరోపణలతో జగన్ 24న డిల్లీ లో ధర్నా చేయబోతున్నారు. అన్ని జాతీయ పార్టీల నేతలను ఆహ్వానించాలని ఆయన తన ఎంపీలను పురమాయించారు. అయితే వారికి ఆ దిశగా సానుకూల ఫలితం లభించడం లేదు.
జగన్ ధర్నాకు మద్దతు తెలియజేయడానికి ఇతర పార్టీల వారు సుముఖంగా లేరట. వైసిపి నేతలకు మొహం చాటేస్తూ ఉన్నారట.
జగన్ ను ఇతర పార్టీలు పట్టించుకోకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఐదేళ్లపాటు ప్రభుత్వంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని మోడీ సర్కారుకు అడ్డగోలుగా అనుకూలంగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తికి తాము ఎందుకు సహకరించాలి అనేది.. ఇండియా కూటమిలోని పార్టీల మాటగా ఉంటోంది. అదే సమయంలో ఎన్డీయే కూటమి పార్టీలు, సహకరించవు. జగన్ ఆ రకంగా ఒంటరి అయిపోయారు.
మొత్తానికి డిల్లీ ధర్నా అభాసుపాలయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇతర పార్టీల వారిని పిలుస్తామని జగన్ చెప్పకుండా ఉండాల్సింది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.