వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలాపాల్ని గమనిస్తే జాలి కలుగుతోంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైనందుకు తమ కనీస బాధ్యతగా శాసనసభ సమావేశాలకు హాజరు కావాలనే ఇంగితం వారికి లేదు. జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా కావాలనే మొండిపట్టుదలతో ఉన్నారు గనుక.. ఆయన సభకు డుమ్మా కొట్టినా సమర్థించుకోగలరు. కానీ.. మిగిలిన పది మంది తమకు ఓట్లు వేసిన ప్రజల ఛీత్కారాలకు ఏం సమాధానం చెబుతారు? ఏం సంజాయిషీలు ఇచ్చుకుంటారు? సభకు ఎగ్గొట్టి ఏ మొహం పెట్టుకుని నియోజకవర్గాల్లో తిరగగలరు? ఇదంతా ఒక ఎత్తు అయితే.. సభకు వెళ్లే ఆలోచన లేని ఈ ఎమ్మెల్యేలు.. సభా సంఘాల్లో తమకు చోటు కావాలని మాత్రం ఆరాటపడిపోతున్నారు. బాధ్యతలు గుర్తుండవు గానీ.. హక్కుల మీద మాత్రం మోజుపడుతున్నారు.
విశాఖ డెయిరీలో భారీగా అవనీతి చోటు చేసుకుంటున్నదని చాలా కాలంగా ఫిర్యాదులు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. విశాఖ స్థానిక నాయకులు ఈ విషయంలో చాలా కాలంగా తమ గళం వినిపిస్తూనే ఉన్నారు. విశాఖ డెయిరీ అవినీతి కార్యకలాపాల మీద దర్యాప్తు జరగాలంటూ వారు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖ డెయిరీ అవినీతిపై విచారణకు ప్రత్యేకంగా శాసనసభ సభాసంఘాన్ని ఏర్పాటుచేశారు. దీనికి ఛైర్మన్ గా జ్యోతుల నెహ్రూ సారథ్యం వహించనుండగా బోండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్‌విఎస్‌కేకే రంగారావు, దాట్ల సుబ్బరాజు సభ్యులు. అయితే ఈ సభా సంఘంలో కేవలం తెలుగుదేశం, జనసేన వారిని మాత్రమే నియమించారని.. ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించలేదని ఇప్పుడు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకుని అరుస్తోంది.
ఇటీవల పీఏసీ ఎన్నికల సమయంలో కూడా రాద్ధాంతం చేయడానికి వైసీపీ ప్రయత్నించింది. కనీసం ఒక్క సభ్యుడైనా గెలిచే బలం 18 సీట్లు తమకు లేకపోయినా పెద్దిరెడ్డితో నామినేషన్ వేయించింది. ఇంకో రెండు కమిటీలకు ఎన్నికలు జరిగితే వాటికి కూడా నామినేషన్లు వేశారు. బలం లేదని తెలుసు. అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం కూడా లేదు. కానీ కమిటీల్లో చోటు మాత్రం కావాలని ఆరాటపడ్డారు. కానీ ఓటములతో భంగపడ్డారు. అది వేరే సంగతి.
అలాగే ఇప్పుడు సభకు వెళ్లని ఈ వైసీపీ ఎమ్మెల్యేలు సభా సంఘంలో చోటు కావాలని ఏ మొహ పెట్టుకుని అడుగుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. విశాఖ డెయిరీ అవినీతి అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి పుణ్యమే అని ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. మళ్లీ విచారణకు వేసిన సభా కమిటీలో కూడా వారే ఉండాలనుకుంటున్నారా? అంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు.
సభకు వెళ్లరు గానీ సభాసంఘం చోటు కావాలిట!
Sunday, January 5, 2025