వ్యూహం సినిమాను ఏపీ ఫైబర్ నెట్‌లో విడుదల చేసినందుకు రాంగోపాల్ వర్మకు చెందిన ఆర్జీవీ ఆర్వీ అనే సంస్థకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. ఇదంతా వ్యూస్ బేస్డ్ అన్నమాట. అంటే.. ఎంత మంది చూస్తే.. అన్ని రూపాయలు.. ఒక వ్యూ కు రూ.100 వంతున ప్రభుత్వం వారికి చెల్లించాలి. అయితే తమాషా ఏంటంటే.. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవితం గురించి.. రాంగోపాల్ వర్మ వంటి సుప్రసిద్ధ దర్శకుడు చేసిన సినిమా అని దాని గురించి ఎంతగా ప్రచారంలో ఊదరగొట్టినప్పటికీ.. ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్న రాష్ట్రంలోని పదిలక్షల మంది చందాదారులు చూసే అవకాశం ఉన్నప్పటికీ.. దానిని చూసిన వారు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 1863 మంది మాత్రమే.
నిజం చెప్పాలంటే.. అంత హైప్ ఇచ్చిన సినిమాను కనీసం రెండువేల మంది కూడా చూడలేదంటే.. జగన్మోహన్ రెడ్డికి.. తన పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎంత ఘోరంగా పరాజయం పాలు కాబోతున్నదో ఆనాడే అర్థమైపోయి ఉండాలి. అంటే కనీసం వైసీపీ నాయకులు కూడా దానిని చూడడానికి ఇష్టపడలేదన్నమాట. ఫ్లాప్ లు తీయడం అనేది ఒక అలవాటుగా మార్చుకున్న ఆర్జీవీ.. ఈ చిత్రాన్ని కూడా అంతే దారుణంగా తీశారు. అయితే 1863 మంది చూసినందుకు ప్రభుత్వం ఆర్జీవీ ఆర్వీ సంస్థకు చెల్లించాల్సిన మొత్తం ఇంచుమించుగా రెండు లక్షల రూపాయలు మాత్రమే. కానీ.. ప్రభుత్వం వారికి ఏకంగా 2.10 కోట్ల రూపాయలు చెల్లించేశారు. అంటే దాదాపుగా ఒక వ్యూ కు, ఏకంగా 11 వేల రూపాయల వంతున చెల్లించినట్టుగా ప్రస్తుత ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి వివరిస్తున్నారు.
ఏపీ ఫైబర్ నెట్ ను అడ్డం పెట్టుకుని.. జగన్మోహన్ రెడ్డి సర్కారు పాల్పడిన అరాచకాలు అన్నీ యిన్నీ కావు. వేల మంది సోషల్ మీడియా సైకోలకు ఈ డిపార్టుమెంటులో ఉద్యోగాల రూపంలో ఉత్తర్వులు ఇచ్చి.. వారు ఎక్కడ ఏం పనిచేస్తున్నారో కూడా తెలియకపోయినా.. నెలకు సుమారు నాలుగు కోట్ల రూపాయల వేతనాలు వారికి ధారపోసిన చరిత్ర జగన్ సర్కారుది. ఆక్రమంలోనే.. ఆర్జీవీకి కూడా ఆ సినిమా తీసినందుకు ఇలా ఫైబర్ నెట్ ద్వారా రుణం తీర్చుకున్నారన్నమాట.
ఈ అరాచకాల దందాలో ఆర్జీవీ మీద తాజాగా మరో కేసు కూడా నమోదు అయ్యే అవకాశం ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. అసలే సోషల్ మీడియాలో వ్యూహం ప్రమోషన్ కోసం పెట్టిన అసభ్య పోస్టుల కారణంగా వర్మ కేసులు ఎదుర్కొంటున్నారు. అలాగే.. ఫైబర్ నెట్ ద్వారా అనుచితంగా లబ్ధి పొందినట్టు మరో కేసు నమోదు అయ్యే అవకాశం ఉందంటున్నారు.
అయితే తన మీద ఏ కేసు వచ్చినా అడ్డంగా మాట్లాడడం వర్మకు అలవాటు. ఎక్స్ పోస్టుల విషయంలో అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అడ్డదారిలో రెండు కోట్లు పుచ్చుకోవడంపై కేసు వచ్చినా సరే.. నాకు డబ్బు ఇవ్వడం అనేది వారి వ్యవహారం.. కేసు పెడితే వారి మీద పెట్టాలి.. నాకేంటి సంబంధం- అని వర్మ వాదించగలరు. కానీ.. ఈ విషయంలో పోలీసు కేసు రిజిస్టరు అయితే గనుక.. వర్మ కు చిక్కులు తప్పవని, ఆయన తీసుకున్న డబ్బు వెనక్కు కక్కవలసి వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.
‘అది వాళ్ల నేరం.. నాకేంటి’ అనగలరు.. ఆర్జీవీ!
Friday, December 20, 2024