దందాలకు చాన్సిచ్చింది తమరే కదా బొత్సగారూ!

Wednesday, November 20, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జకియా ఖాన్ తిరుమల శ్రీవారి దర్శనానికి సిఫారసు ఉత్తరాలను బ్లాకులో విక్రయిస్తున్నట్టుగా తాజాగా కేసు నమోదు అయింది. ఆరుగురికి దర్శనం టికెట్లను 65 వేల రూపాయలకు బ్లాకులో అమ్ముకుంటున్టన్టుగా విజిలెన్సు అధికారులు గుర్తించారు. ఎమ్మెల్సీ జకియాఖాన్ పై కేసు నమోదు అయింది. కేసులో ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా జకియాఖాన్, ఏ3గా పీఆర్వో కృష్ణతేజలపై కేసు నమోదు అయింది. అయితే.. ఆమె అరాచకత్వం, దందా బయటపడి పోలీసు కేసు నమోదు కావడంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కుంటిసాకులు చెబుతోంది. ఆమె తమ పార్టీకి చెందిన వారు కాదని, ఆమె తెలుగుదేశంలో చేరిపోయారని, తెదేపా ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆమె ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారనేది తర్వాతి సంగతి.. ఇలాంటి అరాచకత్వంతో కూడిన దందాలు చేసుకునే నాయకురాలిని తీసుకువచ్చి ఎమ్మెల్సీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే కదా.. అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుమలలో దర్శనం టికెట్లకు ఇచ్చే సిఫారసు ఉత్తరాలను బ్లాకులో అమ్ముకోవడం అనేది చాలా సహజమైన సంగతిగా మారిపోయింది. ఇప్పుడు ఆరుగురు విఐపి టికెట్లకోసం ఎమ్మెల్సీ లేఖ 65 వేల రూపాయలకు అమ్మినట్టుగా బయటకు వచ్చింది. ఇందుకు కొంచెం అటుఇటుగా బ్లాకులో విక్రయాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరైనా దొరికినప్పుడు కొంత చర్చ జరుగుతుందే తప్ప.. మళ్లీ యథావిధిగా ఈ దందా కొనసాగుతూనే ఉంటుంది.ఇప్పుడు ఎమ్మెల్సీ జకియాఖాన్ దొరికిపోవడంతో ఆమెకు తమ పార్టీతో సంబంధం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్న వైఎస్సార్ సీపీ మిగిలిన వారి విషయంలో ఏం చెబుతుందనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. జగన్ జమానాలో మంత్రిగా కూడా పనిచేసిన ఒక నాయకురాలు.. తిరుమల దర్శనాల దందానే తన ప్రధానాదాయంగా మార్చుకుని ప్రతి నెలా కొన్ని లక్షల రూపాయలను తన పీఆర్వోకు టార్గెట్ గా పెట్టి.. సంపాదించుకుంటూ బతుకుతుంటారనే సంగతి బొత్సకుగానీ, జగన్ కు గానీ తెలియదా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

ఇంతకూ జకియాఖాన్ విషయంలో వైసీపీ మాట మార్చడానికి కారణం ఉంది. రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత.. ఆమె వెళ్లి మంత్రి నారా లోకేష్ ను కలిశారు. అభివృద్ధి పనులకోసమే వెళ్లి మంత్రిని కలిసినట్టుగా ఆమె చెప్పుకున్నారు. ఆమె లోకేష్ తో భేటీ అయింది గనుక.. తెలుగుదేశంలో చేరిపోయినట్టేనని, ఆమె టికెట్లు అమ్ముకోవడంతో తమ పార్టీకి సంబంధం లేదని బొత్స సత్యనారాయణ అంటున్నారు.

ఇవాళ ఒక తప్పు బయటపడింది గనుక.. జకియా ఖాన్ తమ పార్టీ వ్యక్తి కాదని అంటున్నారు గానీ, ఎమ్మెల్సీ పార్టీ మారిన మాట నిజమే అయితే.. వారి పార్టీకే చెందిన మండలి ఛైర్మన్ కు ఇన్నాళ్లుగా వైసీపీ ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనేది పెద్ద ప్రశ్న. ఇంకా సూటిగా చెప్పాలంటే.. వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసి, ఆ లేఖలను ఛైర్మన్ కు ఇచ్చినా కూడా వైసీపీకి చెందిన ఛైర్మన్ మోషేన్ రాజు ఇంకా ఆమోదించలేదు. రాజీనామాలు ఆమోదిస్తే మండలిలో తమ పార్టీ బలం తగ్గిపోతుందనే భయం వైసీపీలో ఉంది. జకియాఖాన్ వెళ్లి లోకేష్ ను కలిసినప్పటికీ.. ఆమె మీద అనర్హత వేటు గురించి ఫిర్యాదు చేయకుండా.. టెక్నికల్ గా తమ సభ్యురాలిగా మెయింటైన్ చేస్తోంది వైసీపీ. ఇప్పుడు దందా బయటపడేసరికి తమ పార్టీ కాదని అంటోంది. తమ పార్టీలోనే ఉంటూ కేవలం తిరుమల  దర్శనాల దందాలే జీవనోపాధిగా ఉన్న నాయకుల సంగతేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles