చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో వాల్తేరు వీరయ్య కూడా ఒకటి’. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మెగా అభిమానుల్ని ఆకట్టుకుంది. మరోసారి వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతోందని టాక్ వినపడుతుంది. చిరంజీవి కోసం బాబీ ఓ కథ రెడీ చేశారని, అది చిరుకి బాగా నచ్చిందని, ఈ సినిమాని త్వరలో పట్టాలెక్కించడానికి రెడీగా ఉన్నారని తెలుస్తుంది.
‘విశ్వంభర’ తరవాత కొంతమంది దర్శకుల్ని లైన్‌లో పెట్టారు చిరు. అందులో అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. వీలైతే బాబీ, అనిల్ రావిపూడి ఈ రెండు సినిమాల్నీ ఒకేసారి మొదలెట్టే ఆలోచనలో చిరు ఉన్నారు. మరోవైపు ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కూడా చిరుకి ఓ కథ చెప్పారు. అయితే అది ఇప్పట్లో సెట్ పైకి వెళ్లే అవకాశాలు కనపడడం లేదు.
నానితో `పారడైజ్` సినిమా చేస్తున్నాడు శ్రీకాంత్. ఆ తరవాతే చిరు సినిమా ఉంటుంది. ఈలోగా బాబీ, అనిల్ రావిపూడి సినిమాల్ని పూర్తి చేయాలన్నది చిరు లక్ష్యంగా పెట్టుకున్నారు. బాబీ ప్రస్తుతం బాలకృష్ణతో ‘డాకూ మహారాజ్’ సినిమా చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అనిల్ రావిపూడి సైతం తన సినిమాని సంక్రాంతి బరిలో నిలిపిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ పండక్కే విడుదల కానుంది.