స్కిల్ డెవలప్మెంట్ పథకానికి సంబంధించి.. ప్రభుత్వం కేటాయించిన మొత్తం 371 కోట్లను పూర్తిగా చంద్రబాబునాయుడు సొంతానికి కాజేసేశారని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. హౌస్ కస్టడీకి కూడా ఇవ్వకుండా అడ్డగోలు వాదనలను వినిపిస్తున్నారు. ఆయన భద్రతను, వయసును కూడా పట్టించుకోకుండా తమ వద్ద ఏం సాక్ష్యాలున్నాయో.. వాటిని చూపించకుండా ప్రహసనం నడిపిస్తున్నారు. చంద్రబాబునాయుడును వీలైనన్ని రోజులు జైల్లో ఉంచడం ఒక్కటే లక్ష్యం అన్నట్టుగా ప్రభుత్వం, పోలీసుల తీరు ఉంటోందనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలనుంచి వినిపిస్తున్న కొన్ని సందేహాలను మాత్రం ప్రభుత్వం తరఫున ఎవ్వరూ నివృత్తి చేయడంలేదు. అటు సీఐడీ గానీ, ఇటు సజ్జల గానీ నోరు మెదపడం లేదు. 371 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది అంటున్నారు. పథకం ఒక బూటకం అంటున్నారు. మరి రాష్ట్రలో నలభై కేంద్రాల్లో ఏర్పాటైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల మాటేమిటి? అనేది తొలి ప్రశ్న. నిజానికి ఈ సెంటర్లు ఏర్పాటు అయ్యాయి.. పనిచేశాయి.. శిక్షణలు పొందిన వారు ఉపాధి కూడా పొందారు. ఇటీవలే.. తమ మీద అయిన ఖర్చు వాటాను తాము తిరిగి చెల్లించేస్తాం కానీ చంద్రబాబును దొంగకింద చూడవద్దండి అంటూ కొందరు ముందుకు రావడం కూడా ఆసక్తికర పరిణామం. ఇలాంటి సందేహాలకు ప్రభుత్వం జవాబు చెప్పడం లేదు.
అలాగే.. పరిపాలన పరమైన నిర్ణయాలు మాత్రమే ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతాయి గానీ.. అంతా ఐఏఎస్ ల చేతులమీదుగానే నడుస్తుందన్నది నిజం. అలాంటి నేపథ్యంలో.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కీలక అధికారులైన అజేయకల్లం రెడ్డి, ప్రేమ చంద్రారెడ్డి ల పాత్ర గురించి ఎందుకు దర్యాప్తు చేయడం లేదని విపక్షాలు అడుగుతోంటే ఎవ్వరూ నోరు మెదపడం లేదు. అజేయకల్లం రెడ్డి అప్పట్లో ఈ కార్పొరేషన్ కు ప్రధాన సారథి. ఆయన చేతుల మీదుగానే సమస్త వ్యవహారాలు జరిగాయి. ఆయన అటు ప్రభుత్వంలో ఈ బాధ్యతలు నిర్వహిస్తూనే.. చాటుమాటుగా జగన్మోహన్ రెడ్డి తరఫున కోవర్టుగా పనిచేస్తూ వచ్చారు. జగన్ కోటరీలో కీలకంగా మెలగుతూ వచ్చారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన నాడు ఉదయం 5 గంటల సమయంలో జగన్ ఇంట్లో జరుగుతున్న కీలకమైన మేనిఫెస్టో మీటింగులో అజేయకల్లం స్వయంగా ఉండడమే అందుకు తార్కాణం. ఆ తర్వాత వైసీపీ ఎన్నికల ప్రచారంలో బాగా కీలకంగా తెర వెనుక ముఖ్యవ్యక్తుల్లో ఒకరుగా పనిచేశారు. గెలిచిన తర్వాత పూర్తిగా జగన్ కోటరీ తురుపుముక్కగా చెలామణీ అవుతున్నారు. అందుకే ఆయనను ప్రశ్నించడం లేదనే విమర్శలున్నాయి. కేవలం చంద్రబాబును మాత్రమే ఇరికించే విధంగా మాత్రమే అన్ని సాక్ష్యాలను తయారుచేసినట్టుగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.