అధికారం అండచూసుకుని చెలరేగిపోయిన వ్యవహారాల్లో మరో అక్రమానికి సంబంధించిన కేసులో కీలకమైన అరెస్టు బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మాజీ మంత్రి విడదల రజని మరిది విడదల గోపీని హైదరాబాదులోని గచ్చిబౌలిలో అరెస్టు చేసిన ఏపీ ఏసీబీ పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి. రూ.2.20 కోట్లు ముడుపులు వసూలు చేశారనే ఆరోపణల మీద అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో ఇప్పటికే కేసు నమోదు అయింది. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న విడదల రజని, అప్పటి విజిలెన్స్ అధికారి జాషువా, రజిని పీఏ రామకృష్ణ లపై కేసు నమోదు అయింది. ఒకవైపు రజని ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. విజిలెన్స్ అధికారి జాషువా క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసుల్లో ఇంకా తీర్పు రాలేదు. ఈ ఈ అవినీతి కేసుకు సంబంధించి.. ఇది మొదటి అరెస్టు. రెండు కోట్ల ముడుపులు విడదల రజని మరిది చేతికి ముట్టజెప్పారని తేలడంతో ముందు ఆయననే అరెస్టు చేశారు. ఆయనను విచారించిన తర్వాత.. కేసులోని మిగిలిన వారిపై చర్యలుంటాయని తెలుస్తోంది.
విడదల రజని చిలకలూరిపేట ఎమ్మెల్యే అయిన తర్వాత.. భారీగా వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఆ క్రమంలో స్టోన్ క్రషర్ యజమానులను ఆమె పీఏ ద్వారా తన వద్దకు పిలిపించుకున్నారు. స్టోన్ క్రషర్ వ్యాపారం సజావుగా నిర్వహించుకోవాలంటే.. తనకు అయిదు కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. మాట్లాడి వెళ్లిపోయిన స్టోన్ క్రషర్ యజమానులు వెంటనే స్పందించలేదు. కొన్నాళ్ల తరువాత.. విజిలెన్స్ అధికారి జాషువా భారీ ఎత్తున సిబ్బందితో కలిసి వెళ్లి.. స్టోన్ క్రషింగ్ యూనిట్ మీద దాడి చేసి అనేక లోపాలు ఉన్నట్టుగా వారితో చెప్పారు. అధికారికంగా ఈ దాడి గురించి ఉన్నతాధికార్లకు సమాచారం ఇవ్వకుండానే వెళ్లినట్టుగా ఆరోపణలున్నాయి. పైగా విడదల రజని వారిమీద తనిఖీలు నిర్వహించాల్సిందిగా లేఖ రాసి, ఒత్తిడి తెస్తే తాము వెళ్లినట్టుగా జాషువా చెబుతున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన యజమానులకు ఫోను చేసి.. మేడం తో సెటిల్ చేసుకోవాలని లేకపోతే భారీగా జరిమానా పడుతుందని హెచ్చరించారు.
వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో స్టోన్ క్రషర్ యజమానులు వెళ్లి విడదల రజనిని కలిసినప్పుడు ఆమె అడిగినట్టు అయిదు కోట్లు కాకుండా రెండు కోట్లకు బేరం మాట్లాడుకున్నారు. ఆ మొత్తాన్ని తన మరిది ఇంటికి తీసుకువెళ్లి ఇవ్వాలని ఆమె సూచించారు. చెప్పినట్టుగా.. ఆమె మరిది విడదల గోపీనాధ్ ఇంటికి వెళ్లి రెండు కోట్లు ఇచ్చేసి, అతనికి అదనంగా పదిలక్షలు ఇచ్చారు. అలాగే విజిలెన్స్ అధికారి జాషువాకు కూడా పదిలక్షలు ఇచ్చారు. ఈ వ్యవహారం మొత్తం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బయటకు వచ్చింది.
తమ మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నింటికీ వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం అని విడదల రజని పలుమార్లు హెచ్చరించారు. మొత్తానికి ఈ కేసులో తొలి అరెస్టుగా మాజీ మంత్రి మరిదిని ఏసీబీ పోలీసులు తీసుకువెళ్లారు. మరి వదినమ్మ అరెస్టు ఎప్పుడు జరుగుతుంది? అనేది ఆసక్తికరమైన టాపిక్ గా చర్చ జరుగుతోంది.
కటకటాల్లోకి మరిదిగారు.. మరి వదినమ్మ ఎప్పుడు?
Friday, December 5, 2025
