నాయకుడు.. తమ వద్దకు వచ్చినప్పుడు ప్రజలు రకరకాల సమస్యలు చెప్పుకుంటారు. నాయకుడు వాటిని తీర్చడానికి ప్రయత్నించాలి. ప్రతిపక్షంలో ఉండడం వలన తమ మాట చెల్లుబాటు కాదు అనుకుంటే.. ఆ సమస్యలకు సంబంధించి ప్రజలకు ధైర్యం చెప్పాలి. అంతేతప్ప మరింతగా వారిని రెచ్చగొట్టేలా మాట్లాడకూడదు. ప్రత్యేకించి కేసులు, నేరాలు తదితర వ్యవహారాలకు సంబంధించిన వాటిలో ప్రజలు వారికి ఎదురైన ఇబ్బందులు చెప్పుకోవచ్చు గాక! కానీ నాయకుడు వాటిని ఆలకించడంలో సంయమనం పాటించాలి. అలా కాకుండా మరింత రెచ్చగొట్టేలా మాట్లాడినా వ్యవస్థలను కించపరుస్తూ మాట్లాడినా అది బ్యాక్ ఫైర్ అవుతుంది. ఆ నాయకుడి పరువు పోతుంది. ప్రజలలో చులకన అవుతారు. ఈ విషయం ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చు. అందుకే ఆయన.. ‘డీఎస్పీ కొట్టాడు అన్నా’ అని ఒక కార్యకర్త వచ్చి మొరపెట్టుకుంటే.. ‘మూడేళ్ల తర్వాత అదే డిఎస్పీ తో నీకు సెల్యూట్ కొట్టిస్తా పో’ అంటూ బహిరంగంగా మాట్లాడడం చాలా అహంకార ప్రదర్శన లాగా ఉంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజలను కలిశారు. వారి వినతులను స్వీకరించారు. అయితే ఇక్కడే ఓ చిత్రమైన సంఘటన జరిగింది. వివరంగా పరిశీలిస్తే..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును పూర్తిగా ఇంకొక డైరెక్షన్ లోకి మళ్లించడానికి ఇప్పుడు వ్యూహాత్మకంగా ఒక ప్రయత్నం జరుగుతున్న సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి తొలినుంచి ఇది వైస్ వివేకా కూతురు–అల్లుడు కలిసి చేయించిన హత్య అని అంటున్నారు. ఆ వాదనకు మరింత బలం ఇచ్చేలా ఇటీవల హత్య అనే సినిమాను కూడా విడుదల చేశారు. హత్యలో కీలక నిందితుడిగా అరెస్టు అయి ప్రస్తుతం బెయిలుమీద బయట ఉన్న సునీల్ యాదవ్ కేరక్టర్ ను ఆ సినిమాలో పచ్చి విలన్ గా చూపించారు. ఆ సినిమాలోని అలాంటి సన్నివేశాల్ని.. వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా దళాలు విస్తృతంగా వైరల్ చేయడం ప్రారంభించాయి. దాంతో సునీల్ యాదవ్.. జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తనను, తన తల్లిని కించపరిచేలా ఉన్న ఆ సినిమా సీన్లను ఆపించాలని, వైరల్ చేసే వారిని కూడా కట్టడి చేయాలని కోరారు. తనకు వైసీపీ వారినుంచే ప్రాణగండం ఉందని రక్షణ కావాలని కూడా అడిగారు.
ఈ నేపథ్యంలో.. పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ ను పవన్ కుమార్ అనే పార్టీ సోషల్ మీడియా కార్యకర్త కలిశారు. ‘వైఎస్ అవినాష్ అన్న యూత్’ అనే పేరుగల వాట్సప్ గ్రూపు ఎడ్మిన్ గా అతను ఉన్నారు. సునీల్ యాదవ్ ఫిర్యాదు తర్వాత పోలీసులు అతడిని పిలిచి విచారించారు. అతను జగన్ ను కలిసి.. డీఎస్పీ, సీఐ తనను కొట్టారంటూ ఫిర్యాదు చేశారు. అతడిని ఊరడించిన జగన్మోహన్ రెడ్డి.. ‘మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తా అప్పటిదాకా ధైర్యంగా ఉండు’ అంటూ చెప్పడం చుట్టూ ఉన్నవారిని కూడా విస్మయానికి గురిచేసింది.
ఈ మాటలు గమనిస్తే చాలు.. పోలీసులంటే జగన్ కు ఎంత చులకన భావం ఉన్నదో అర్థమవుతోందని.. ఎలాంటి సంకుచిత, పెత్తందారీ, నియంతృత్వ బుద్ధులతో ఆయన అధికారాన్ని కోరుకుంటున్నారో అర్థమవుతున్నదని ప్రజలు అంటున్నారు. జగన్ మాటలు ఆయన అహంకారానికి నిదర్శనాలు అని కూడా అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9నెలలే అవుతుండగా.. ఇంకో మూడేళ్లలోనే అధికారంలోకి వస్తానని జగన్ అనడంపై మీమ్స్ కూడా పేలుతున్నాయి.