అమరావతిలో అనేక సంస్థలకు భూకేటాయింపులు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. భూకేటాయింపుల వ్యవహారం కొత్తదేమీ కాదు. ఎన్నాళ్లుగానో చర్చ్ల్లో నలుగుతున్నవే. పాలకులద్వారా ప్రకటనల్లో తెలుస్తున్నవే. అయితే.. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో 13 సంస్థలకు చేసిన భూ కేటాయింపులను రద్దు చేస్తూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. భూకేటాయింపులు పొందిన తర్వాత.. నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించే దిశగా అడుగు వేయకపోవడమే ఈ రద్దులకు కారణం. ఇలా ఒకప్పటి సంస్థలకు చేసిన కేటాయింపులను రద్దు చేయడం అనేది.. ఇప్పుడు స్థలాలు పొందిన వారికి ఒక హెచ్చరికగా పనిచేస్తాయని ప్రజలు నమ్ముతున్నారు.
తాజాగా కేటాయింపులు పొందిన వాటిలో బిట్స్ (బిర్లా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్) కు 70 ఎకరాలు, ఐటీ టవర్ నిర్మాణానికి ఎల్ అండ్ టీకి 10 ఎకరాలు, అమరావతిలో ఆస్పత్రి, మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం, ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కోసం 25 ఎకరాలు కేటాయించారు. వీరందరికీ తమ నిర్మాణాలను ప్రారంభించడానికి, అలాగే సంస్థల కార్యకలాపాలను ప్రారంభించగడానికి కూడా నిర్దిష్టంగా గడువు విధించారు. ఆ గడువులోగా పనులు చేపట్టలేకపోతే వీరి కేటాయింపులు కూడా రద్దవుతాయని ప్రభుత్వం ఒప్పందాల్లో పేర్కొంది.
అమరావతి నిర్మాణాలు వేగంగా జరగడానికి కేటాయింపుల రద్దు ఒక హెచ్చరికలాగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు రకరకాల ఆశలతో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేస్తుంది. వారు నిర్మాణాలు చేపట్టడం వలన.. పలువురికి ఉపాధి కలుగుతుందని.. ఆ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభిస్తే పలువురికి ఉద్యోగాలు వస్తాయని, అలాగే పన్నుల రూపేణా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటుందని.. ఇలా రకరకాల ఆశలుంటాయి. అయితే స్థలాలు పుచ్చుకున్న సంస్థలు అసలు నిర్మాణాలే చేపట్టకపోతే.. ఆ ఆశలన్నీ స్తంభిస్తాయి. అలాంటప్పుడు వారిలో చురుకుదనం పుట్టించడానికి కేటాయింపులు రద్దు అవుతాయనే హెచ్చరికగా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఈ రద్దులు వారందరికీ హెచ్చరికలే!
Saturday, March 22, 2025
