ప్రభుత్వాన్ని నిందించడం ఒక్కటే వారి లక్ష్యం. అందుకు నిత్యం శతకోటి మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. అబద్ధాలకు కూడా విలువ ఆపాదించే తప్పుడు దారులను వెతుకుతూ ఉంటారు. నేరుగా ఒక అబద్ధాన్ని తమ మీడియా ద్వారా ప్రచారంలో పెట్టడం ఒక పద్ధతి. అలాకాకుండా, ఒక అబద్ధాన్ని ముందు రకరకాల వ్యక్తులనుంచి ప్రచారంలో పెట్టేసి.. ఆ అబద్ధాన్ని బాగా పాపులర్ చేసి.. ఆ తర్వాత.. దేశమంతా ఇలా అనుకుంటున్నది అంటూ.. అదే అబద్ధాన్ని మీడియా ద్వారా ఇంకాస్త హైలైట్ చేయడం ఇంకో పద్ధతి. ఈ రెండో పద్ధతి బాట మేలుగా అనిపించి.. వైఎస్సార్ కాంగ్రెస్ ట్రయాంగులర్ విధానం అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలి వర్షాల సమయంలో అమరావతి మునిగిపోతున్నదని అనడంతో పాటు, అమరావతిని ముంచకుండా కాపాడడం కోసం ఇతర ప్రాంతాలను ముంచేస్తున్నది ప్రభుత్వం అంటూ వేసిన నిందల గురించి ఆరాతీస్తే.. ఇలాంటి తప్పుడు విధానాలే బయటకు వస్తున్నాయి. విచారణ ఎదుర్కొన్న వైసీపీ నాయకులే ఇలాంటి వాస్తవాల్ని బయటపెట్టడం విశేషం.
ముందుగా సోషల్ మీడియాలో రకరకాల తప్పుడు పోస్టులను సృష్టించి హోరెత్తిస్తారు. అనేకానేక ఖాతాలనుంచి వివిధ రకాలుగా తయారుచేసిన అనేక పోస్టులను ప్రవాహంలా విడుదల చేస్తే.. కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లోని తప్పుడు పోస్టులు వైరల్ అవుతాయి. ఆ తర్వాత.. పార్టీకి చెందిన లోకల్, మరియు స్టేట్ లెవల్ నేతలతో అదే టాపిక్ గురించి మాట్లాడిస్తారు. సోషల్ మీడియాలో ఎలాంటి నిరాధార విషం ప్రచారం అవుతూ ఉంటుందో.. అదంతా ఒకేచోట గుదిగుచ్చి.. ప్రెస్ మీట్ పెట్టి మళ్లీ విషం కక్కుతారు. ఆ వెంటనే.. సాక్షి దినపత్రిక, టీవీ చానెల్ రంగంలోకి వస్తాయి. ఫలానా నాయకుడు మాట్లాడారంటూ.. అదే ఆధారంగా చూపించుకుంటూ వాళ్లు పతాక శీర్షికల కథనాలను వండి వారుస్తారు.
ఇంతాకలిపి ఎవ్వరికీ నిర్దిష్టమైన సోర్స్ ఉండదు. ఆధార సహిత విమర్శలు ఉండవు. నిజాలు ఉండవు. ఇలాంటి చవకబారు ట్రయాంగిల్ నిందల కుట్రను వైఎస్సార్ కాంగ్రెస్ అనుసరిస్తోంది. తొలినుంచి వారు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ముందు సోషల్ మీడియాలో దుష్ప్రచారం సాగిస్తున్నారు. అవన్నీ చాలా వరకు అనధికార, దొంగ, నకిలీ అకౌంట్లు అయి ఉంటన్నాయి. అక్కడినుంచి పెద్దపెద్ద తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. ఒక స్కెచ్ ప్రకారం జరుగుతున్న ఈ కుట్రప్రచారాల వైనం.. తాజాగా అమరావతి గురించిసాగించిన దుష్ప్రచారంలో పొన్నూరు వైసీపీ ఇన్చార్జి అంబటి మురళీకృష్ణ మాటల్లో బయటపడింది.
అమరావతిని లేపడం కోసం పొన్నూరును ముంచుతున్నారు.. అంటూ అంబటి మురళీకృష్ణ తీవ్రమైన విమర్శలు చేశారు. అందుకు మద్దతుగా పొన్నూరు ప్రాంతంలోని నీళ్లు నిలిచి ఉన్న పొలాల ఫోటోలను జతచేశారు. కొండవీటి వాగు దగ్గరినుంచి నీళ్లను పొన్నూరు మీదికి పంపినట్టుగా ఆరోపించారు. వాటన్నింటినీ సాక్షి చాలా ప్రముఖంగా ప్రచురించింది. అయితే పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తే.. తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను బట్టి మాట్లాడానని అంబటి మురళీకృష్ణ చేతులు దులుపుకున్నారు. వైసీపీ దుర్బుద్ధులు ఈ రకంగా బయటపడుతున్నాయి. ముందు సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టడం, తర్వాత నాయకులతో మాట్లాడించడం, తర్వాత సాక్షిలో పతాకశీర్షికలతో పెట్టడం వారి ఆలోచన అని అర్థమవుతోంది. వారి దుష్ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలు అనుకుంటున్నారు.
బద్నాం చేయడంలో ఇవి ట్రయాంగిల్ కుట్ర స్టోరీలు
Thursday, December 4, 2025
