పార్టీ పుట్టిన నాటినుంచి మోడీ ఎదుట సాగిలపడడమే జగన్ జీవితలక్ష్యం అన్నట్టుగా బొత్స సత్యనారాయణ మాటలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తన శత్రు కూటమికి చెందిన ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని జగన్ తీసుకున్న అవకతవక నిర్ణయం గురించి ఈ మాజీ మంత్రి చెప్పిన భాష్యం ఇది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకరు, శాసనసభ స్పీకరు వంటివన్నీ పార్టీలకు అతీతంగా రాజ్యాంగబద్ధ పదవులనేది బొత్స చెబుతున్నారు. ఇలాంటి వాటిని గౌరవించాలనేది పార్టీ పుట్టినప్పటినుంచి జగన్ నిర్ణయం అని భాష్యం చెబుతున్నారు. ఒకవైపు ఎన్నిక జ రుగుతుండగా.. జగన్ తీసుకునే నిర్ణయానికి.. ఆ పదవుల పట్ల ఉండే గౌరవానికి సంబంధం ఏమిటో బహుశా తన మాటల్లో బొత్సకైనా అర్థమైందో లేదో తెలియదు.
ఆ పదవి పట్ల గౌరవం నిజమే కావొచ్చు. అంతమాత్రాన.. ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తే మాత్రమే.. ఆ పదవుల పట్ల గౌరవం ఉన్నట్టా? జస్టిస్ సుదర్శన్ రెడ్డి వంటి వివాదరహితుడైన వ్యక్తి ఇండియా కూటమి అభ్యర్థిగా ఉండగా.. పార్టీ రహితంగా ఆ పదవికి మర్యాద గౌరవం ఇచ్చే వ్యక్తి జగన్ అయితే గనుక.. ఆయన జస్టిస్ సుదర్శనరెడ్డికే మద్దతు ఇవ్వాలి. కానీ.. తన స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం, మోడీని ప్రసన్నం చేసుకోవడం ద్వారా కేసుల నుంచి రక్షణ పొందడం కోసం.. వారు ఎవరిని అభ్యర్థిగా పెడితే.. వారికి జైకొట్టే తత్వాన్ని అలవాటు చేసుకున్న పిరికితనంతో జగన్ రాధాకృష్ణన్ కు మద్దతిచ్చే నిర్ణయానికి వచ్చారనేది కాంగ్రెస్ మాటగా ఉంది.
నిజానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు రాధాక్రిష్ణన్ కే ఓటు వేస్తాయి. ఎందుకంటే.. వారు ఎన్డీయేలో భాగస్వాములు. రాధాక్రిష్ణన్ అంటే.. వారి సొంత అభ్యర్థి కింద లెక్క. కానీ.. జగన్ మోహన్ రెడ్డికి వేరే గతిలేక తన శత్రువుల అభ్యర్థికే ఓటు వేస్తున్నారని.. దీనిద్వారా.. ఆయన ప్రజల దృష్టిలో ధైర్యంలేని, వెన్నెముక లేని నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మోడీ వద్ద జగన్ సాగిలపడుతూ తన స్వప్రయోజనాలు చూసుకుంటున్నారని ఆరోపించడంలో కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడు ప్రదర్శిస్తూ ఉంది. ఆ ఆరోపణల్లో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాహుల్- చంద్రబాబు హాట్ లైన్ లో టచ్ లో ఉంటారని ప్రకటించి.. జగన్ కొరివితో తల గోక్కున్నారు. తీరా ఇప్పుడు మోడీతో టచ్ లో ఉండేది తానేనని.. తనకు వేరే గతిలేదని.. మోడీ పాదాలను నమ్ముకోవడం తప్ప తనకు మనుగడ లేదని ఆయన చాటుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు.
వేరే గతిలేదు : టీడీపీ, జనసేన బాటలోనే నడవనున్న జగన్!
Tuesday, December 9, 2025
