కాదంబరి జెత్వానీ కేసులో జగన్ కళ్లలో ఆనందం చూడడానికి అత్యుత్సాహం ప్రదర్శించిన వారు ఇప్పుడు అడ్డంగా బుక్కయిపోతున్నారు. ఆల్రెడీ సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులు, అరెస్టు ను తప్పించుకోగల అవకాశాలు పరిమితంగా కనిపిస్తున్నాయి. బెయిలు ఇవ్వాలని కోరుతూ వారు న్యాయస్థానం ఎదుట వినిపిస్తున్న వాదనలు కూడా వారిని మరింతగా బుక్ చేసేలా ఉన్నాయి. ముంబాయికి ఎందుకు వెళ్లారనే విషయంలో డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారు గానీ.. కేసు రిజిస్టరు కావడానికంటె ముందే బయల్దేరి ఎందుకు వెళ్లారనేదానికి సస్పెండయిన ఐపీఎస్ ల వద్ద జవాబు లేకుండా పోతోంది.
ముంబాయి నటి కాదంబరి జెత్వానీ ఫోర్జరీ సంతకాలతో తన ఆస్తులను అమ్మేయడానికి ప్రయత్నించిందంటూ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు సంగతి అందరికీ తెలుసు. కాదంబరి ని అరెస్టు చేసి తీసుకురావాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన పర్యవసానంగా అలాంటి ఒక కేసును ఫ్యాబ్రికేట్ చేశారు. సీఎంవో నుంచి స్వయంగా.. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఫోను చేసి ఇద్దరు ఐపీఎస్ లు కాంతిరానా తాతా, విశాల్ గున్నీలను పురమాయించి వ్యవహారం నడిపించారు. కేసు రిజిస్టరు కావడానికంటె ముందే వాళ్లు కాదంబరి అరెస్టు కోసం ముంబాయికి వెళ్లడానికి టికెట్లు బుక్ చేసేసుకున్నారు.
ఆ పాపాలన్నీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటపడుతున్నాయి. ముగ్గురు ఐపీఎస్ లూ సస్పెండ్ అయి విచారణ ఎదుర్కొనే స్థితిలో ఉన్నారు. సస్పెండైన ఇద్దరూ కాంతిరానా, విశాల్ గున్నీ.. ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ విచారణలో వారి వాదనలు కామెడీగా ఉంటున్నాయి. నిజం చెప్పాలంటే.. వారి వాదనలే వారిని మరింత అడ్డంగా బుక్ చేసేలా ఉన్నాయి.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముంబాయి పోలీసులతో సమన్వయం చేసుకునేందుకు విశాల్ గున్నీ అక్కడకు వెళ్లినట్టుగా కోర్టులో వాదనలు వినిపించారు. ఏ కేసుకోసం పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లినా.. అక్కడి పోలీసులతో సమన్వయం చేసుకోవడానికి ఒక ఐపీఎస్ అధికారి వెళ్లాలా? ప్రోటోకాల్ నిబంధనలు ఇదే చెబుతాయా? అనేది పెద్ద ప్రశ్న. అలాంటి ప్రశ్న ఎదురైతే వారి వద్ద జవాబు లేదు. పైగా.. ముంబాయి వెళ్లారు సరే.. అసలు కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టకముందే ఎలా టికెట్లు బుక్ చేసుకోగలిగారు. కేసు విజయవాడలో నమోదైన సమయానికి వారు హైదరాబాదు ఎయిర్ పోర్ట్ లో ఎలా ఉండగలిగారు.. అనేది వారు జవాబు చెప్పలేని మరో ప్రశ్న. ఈ రకంగా ఐపీఎస్ లు పీకల్దాకా కూరుకుపోయినట్టుగా కనిపిస్తోంది.
అదే సమయంలో.. సీతారామాంజనేయులు ఈకేసులో ఏ2 కాగా ఇప్పటిదాకా ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని, అసలు దేశంలో ఉన్నారా? పరారయ్యారా? అని కోర్టు ప్రశ్నించడం విశేషం. ఈ వ్యవహారంలో ఐపీఎస్ లు అడ్డంగా బుక్ అయినట్టే కనిపిస్తోంది.
ఆన్సర్ లేదు.. ఐపీఎస్ లు అడ్డంగా బుక్కైపోతున్నారు!
Wednesday, January 22, 2025