సుప్రీంలో కూడా నిరాశే: మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం!

Thursday, December 4, 2025

40 మంది నిందితులలో అరెస్టు కాబోతున్న రెండో రాజకీయ నాయకుడుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వార్తల్లో వ్యక్తిగా నిలవబోతున్నారు. మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేసిన లిక్కర్ కుంభకోణంలో.. అత్యంత కీలకమైన నిందితుల్లో ఒకరుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిగ్గు తేలారు. కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనకు మాస్టర్  మైండ్ గా వ్యవహరించడం దగ్గరినుంచి.. మొత్తం గైడెన్స్ చేస్తూ, తన వాటాగా నెలకు రూ.5 కోట్లు కూడా తీసుకున్నట్టుగా సిట్ విచారణలో లెక్కలు తేల్చారు. అయితే విచారణ మొదలైన తొలినాటినుంచి ముందస్తు బెయిలుకోసం తన ప్రయత్నాలు తాను చేసుకుంటూనే ఉన్నారు. కానీ.. న్యాయస్థానం నుంచి ఊరట లభించడం లేదు. తొలుత ఆయనను సాక్షిగా పిలిచి విచారించిన సిట్, తర్వాత ఆయన పేరును నిందితుల జాబితాలో కూడా చేర్చింది. మిథున్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ రెండురోజుల కిందట తిరస్కరణకు గురైంది. అరెస్టునుంచి రక్షణ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. ఆయన సుప్రీంలో అప్పీలు చేసుకోగా, అక్కడ కూడా పిటిషన్ తిరస్కరించారు. అరెస్టునుంచి రక్షణ ఇవ్వాలని కోరగా అందుకు కూడా సుప్రీం తిరస్కరించింది. అరెస్టు చేయకుండా చార్జిషీటు ఎలా దాఖలు చేస్తారంటూ ఎదురు ప్రశ్నించింది. చివరికి మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ లొంగిపోవడానికి కొంత సమయం ఇవ్వాలంటూ సుప్రీంను అభ్యర్థించారు. అలా సమయం ఇవ్వడానికి కూడా ధర్మాసనం అంగీకరించలేదు. అన్ని రకాలుగానూ హతాశులైన మిథున్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
అదే సమయంలో విజయవాడలో.. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు వారంటు తీసుకున్నారు.మూడున్నర వేల కోట్ల కుంభకోణంలో ఎంతెంత వాటాలు పంచుకున్నారనే లెక్కలు కూడా సిట్ పోలీసులు తయారు చేశారు. మొత్తంలో పది శాతం వరకు, నిందితులుగా ఉన్న కీలక వ్యక్తులు, నాయకులు అందరూ కలిసి పంచుకున్నట్టు తేల్చారు. అందులో అప్పట్లో ఎంపీలుగా పనిచేస్తున్న ఇద్దరికి ప్రతినెలా ఐదు కోట్ల వంతున వెళ్లేదని కూడా తేల్చారు. వారిలో ఒకరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాగా, ఇప్పుడు మాజీగా మారిన మరో నిందితుడు విజయసాయిరెడ్డి.

విజయసాయిరెడ్డికి కూడా సిట్ పోలీసులు ఇటీవల విచారణకు రావల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అయితే.. కొన్ని కారణాల వల్ల మరో పదిరోజుల్లోగా విచారణకు వస్తానని విజయసాయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే.. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టుకు వారంటు కూడా తీసుకున్న వాతావరణాన్ని గమనిస్తోంటే.. విచారణకు హాజరైనప్పుడు విజయసాయిరెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.

బెయిలు తెచ్చేసుకుంటే.. వ్యవహారాన్ని సాగదీస్తూ ఉండవచ్చునని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భావించారు గానీ.. సుప్రీంలో కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగలడంతో.. షాక్ కు గురయ్యారు. కటకటాల్లోకి వెళ్లాల్సిందేనని పలువురు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles