కూటమి పార్టీల నుంచి ఎవ్వరు ఏ విమర్శ చేసినా సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నుంచి గల్లీ లీడర్ల వరకు కౌంటర్లతో వీరస్థాయిలో విరుచుకుపడిపోతారు. అలాంటిది ఇప్పుడు మాత్రం చాలా సైలెంట్ గా ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా వచ్చిన ఆరోపణలు మామూలివికాదు. ఆరోపణలు చేసిన వ్యక్తి కూడా ఆర్డినరీ వ్యక్తి కాదు. జగన్ కు మామయ్య అయ్యే బాలినేని శ్రీనివాసరెడ్డి- జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడుతూ.. ‘పిఠాపురం అమ్మవారి సాక్షిగా చెబుతున్నా.. జగన్ నా ఆస్తులనూ కాజేశారు.. నాకు జరిగిన అన్యాయం ఒక్కరోజు చెబితే సరిపోదు..’ అంటూ బాలినేని ఆరోపించారు. ఇవి మామూలు ఆరోపణలు కాదు.. చాలా తీవ్రమైనవి. అయితే ఈ ఆరోపణలకు జగన్ నుంచి గానీ, ఆయన పార్టీ వారినుంచి గానీ, ఇప్పటిదాకా ఎలాంటి కౌంటర్లు రావడం లేదు. చూడబోతే.. బాలినేని విమర్శలకు కౌంటర్లు ఇచ్చి కెలికితే.. జగన్ బండారం మరింతగా బయటపడుతుందని వారు భయపడుతున్నట్టుగా ఉంది.
2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి పూర్వం.. బాలినేని శ్రీనివాసరెడ్డి హవా వైఎస్సార్ కాంగ్రెస్ లో మామూలుగా ఉండేది కాదు. వైఎస్ జగన్ ప్రతి నిర్ణయంలోనూ ఆయన చాలా కీలకంగా ఉండేవారు. తనను సంప్రదించే అనేకమంది నాయకులను, ‘మామయ్యతో మాట్లాడాలని, తర్వాత తన నిర్ణయం ఉంటుందని’ చెప్పే స్థాయిలో బాలినేని హవా ఉండేది. కానీ.. జగన్ కు అధికారం పట్టగానే.. పరిస్థితులు మారాయి. జగన్ కోటరీగా ఆయనకు దగ్గరగా మెలిగే వ్యక్తులు మారిపోయారు. బాలినేని కేవలం ఒక మంత్రిగా ఉన్నారుగానీ, ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి కూడా నిర్ణయాలు ఆయన చేతిలో ఉండేవి కాదు. పైగా మూడు సంవత్సరాల తర్వాత.. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ పేరుతో.. బాలినేనిని పక్కకు తప్పించారు జగన్.
కూటమిప్రభుత్వం గద్దె ఎక్కిన తర్వాత బయటకు వచ్చిన పాత ప్రభుత్వపు అరాచకాల్లో.. సెకి ముసుగులో అదానీగ్రూపుతో కుదుర్చుకున్న సౌరవిద్యుత్తు ఒప్పందాలు కీలకమైనవి. ఆ ఒప్పందాల వ్యవహారం అప్పటి విద్యుత్తు శాఖ మంత్రిగా ఉన్న తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండానే జరిగిపోయాయని బాలినేని శ్రీనివాసరెడ్డి బాంబు పేల్చారు. జగన్ పరాజయం తర్వాత.. ఆ పార్టీని వీడి.. జనసేనలో చేరిన బాలినేని, చచ్చేవరకు పవన్ కల్యాణ్ వెంట ఉంటానని అనడం కూడా విశేషం. అదంతా ఒక ఎత్తు అయితే ఆవిర్భావ సభలో ఆయన వ్యాఖ్యలు కీలకమైనవి. తన సొంత ఆస్తులను కూడా జగన్ కాజేశారని బాలినేని అంటున్నారు. ఆ మాటలకు వైసీపీ నుంచి కౌంటర్లు రావడం లేదు. ఆయనకు ఏ కౌంటర్ ఇస్తే ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోనని వైసీపీ భయపడుతున్నట్టు సమాచారం. ఎందుకంటే.. ‘జగన్ చేసిన అన్యాయాలన్నీ త్వరలోనే చెబుతా’ అంటూ బాలినేని తన అమ్ములపొదిలో మరో బ్రహ్మస్త్రం దాచుకున్నారు. ఆయనను నిందిస్తే.. జగన్ గురించి.. ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటకు తెస్తారోనని జగన్ అనుచరులు జడుసుకుంటున్నట్టుగా ఉంది.
బాలినేని కడుపుమంటపై కౌంటర్లు రావడం లేదే!
Sunday, March 16, 2025
