గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనలో ఉండగా.. ఒక చిత్రం జరిగింది. ఆయన వాహనం వద్దకు ఎంపీ అవినాష్ రెడ్డి రాబోతుండగా.. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ‘‘నా తమ్ముడే అయ్యా.. రానివ్వండి’’ అంటూ జగన్ చెబుతున్నా కూడా వారు పట్టించుకోలేదు. ఆరోజు తమ్ముడు అవినాష్ ను తన వాహనం వద్దకు రానివ్వనందుకు.. ‘‘నా తమ్ముడే అయ్యా’’ అంటూ జగన్ ఆక్రోశించారు.
సీన్ కట్ చేస్తే-
తాజాగా గుంటూరు మిర్చి యార్డులో మరో చిత్రం జరిగింది. ప్రభుత్వం కేంద్రం ద్వారా రైతులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలు ఫలించబోతున్నాయనే సమాచారంతో.. హడావుడిగా పరామర్శ యాత్ర పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అక్కడకు ఆయన తన బాబాయి వైవీసుబ్బారెడ్డి, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డిలతో కలిసి వచ్చారు. జగన్ వస్తున్నారు గనుక మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా అక్కడకు వచ్చారు. వైవీ, కొడాలి జగన్ కాన్వాయ్ లోనే వచ్చారు. అయితే పరామర్శ ప్రహసనం తర్వాత.. తిరిగి వెళుతున్న సమయంలో.. జగన్ కాన్వాయ్ కారులోకి లేళ్ల అప్పిరెడ్డిని ఎక్కించుకున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా ఎక్కబోతుండగా జగన్ భద్రతా సిబ్బంది పక్కకు నెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఏమాత్రం వారించకపోవడం విశేషం. జగన్ పట్ల భక్తి ప్రదర్శిస్తూ ఉండే దళిత నాయకుడిని, ఈ రకంగా కారులోకి కూడా ఎక్కనివ్వకుండా అవమానించడం చూసి జనం విస్తుపోవడం గమనార్హం.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో గతంలో నందిగం సురేష్ అరెస్టు అయ్యారు. అదే కేసులో ఇంకా అనేక మంది కీలక నాయకులు ఉన్నప్పటికీ.. జగన్ దళాలు, వైసీపీ పార్టీ వారికోసం చాలా తాపత్రయపడి పెద్ద లాయర్లను రంగంలోకి దింపాయి. లేళ్ల అప్పిరెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి తదితరులు అరెస్టు దాకా వెళ్లకుండా తప్పించుకోగలిగారు. కానీ నందిగం సురేష్ మాత్రం అరెస్టు అయి సుదీర్ఘకాలం జైల్లో గడిపారు. తనకోసం పార్టీ గట్టి చర్యలు తీసుకోలేదని అప్పట్లోనే నందిగం వాపోయినట్టుగా కథనాలు వచ్చాయి. నామ్ కే వాస్తే గా జగన్ నందిగంసురేష్ ను కూడా జైల్లో పరామర్శించారు. దళిత నాయకుడి పట్ల వివక్షను అప్పట్లోనే అలా చూపించారు.
తీరా ఇప్పుడు మిర్చి రైతుల పరామర్శ పేరుతో ప్రజల్లోకి వచ్చి.. ఇలా దళిత నాయకుడిని అవమానించడంపై ఇప్పుడు పార్టీ వారే ఆగ్రహిస్తున్నారు. సాధారణంగా నాయకులు తాము ప్రెస్ మీట్లకు, ప్రజల ఎదుటకు వెళ్లేప్పుడు ఒక దళిత నాయకుడిని పక్కన పెట్టుకుంటారు. తద్వారా.. తమకు అన్ని వర్గాల మద్దతు ఉన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటారు. నందిగం సురేష్ ను అందుకు వాడుకుంటున్నారే తప్ప.. కనీసం కారు ఎక్కడానికి కూడా దళితుడు పనికిరాడా అని జనం విస్తుపోతున్నారు.
అప్పుడలా.. ఇప్పుడిలా! జగన్‌లోని సిసలైన దళితప్రేమ!
Saturday, April 12, 2025
