కొత్త ఆశలు పుట్టిస్తున్న కేంద్రమంత్రి మాటలు!

Tuesday, January 21, 2025

విశాఖ ఉక్కు పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయంతో ఉద్యోగులందరూ చాలాకాలంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు సాగుతున్నాయి. గతంలో జనసేన అధ్యక్షుడి హోదాలోనే విశాఖను సందర్శించిన పవన్ కల్యాణ్.. ఉక్కు పరిశ్రమ కార్మికుల శిబిరాన్ని సందర్శించి ప్రెవేటీకరణ జరగకుండా కాపాడుతానని హామీ ఇచ్చారు. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కేంద్ర సహాయమంత్రిగా నరసాపురం బిజెపి ఎంపీకి పదవి దక్కడంతో వీరిలో కొంత ఆశ చిగురించింది. తాజాగా కేంద్ర పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించి చెప్పిన మాటలు వారికి సరికొత్త ఆశలు పుట్టిస్తున్నాయి. పరిశ్రమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు అనుకుంటున్నారు.


విశాఖను సందర్శించిన కుమారస్వామి మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతోందని అన్నారు. ఈ ప్లాంట్ పై అనేక మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయన్నారు. ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన వద్దని, దీనిని రక్షించడం తమ బాధ్యత అని అన్నారు. మోడీ ఆశీస్సులతో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని కూడా కుమారస్వామి అనడం విశేషం.
విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళుతున్నదనే భావనతో  కేంద్రం దీనిని ప్రెవేటీకరించాలని నిర్ణయించింది. అయితే విశాఖలో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా చాలా ఆందోళనలు జరిగాయి. కేంద్రం తమ నిర్ణయం విషయంలో ముందడుగు వేయలేదు. మిన్నకుండిపోయింది. తాజాగా పరిస్థితులు మారుతున్నాయి. బిజెపికి చెందిన విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి అనుకూలంగా మాట్లాడారు. ఈ ప్లాంట్ ప్రెవేటీకరణ జరగకూడదనేది అందరి కోరిక అని ఆయన అన్నారు. విశాఖకు వచ్చిన మంత్రి కుమారస్వామిని ఆయన ప్రత్యేకంగా వచ్చి కలిశారు. ఎందరివో ప్రాణత్యాగాలతో వచ్చిన ఈ ప్లాంటుకు మంచి భవిష్యత్తు ఉండేలా చూడాలని మంత్రిని కోరినట్టు చెప్పారు. ఉద్యోగుల భవిష్యత్తు దెబ్బతినకుండా నిర్ణయాలు ఉండాలని చెప్పుకొచ్చారు.

అయితే ఇటు విశాఖ ఎమ్మల్యే, మంత్రి కుమారస్వామి చెబుతున్న మాటలు విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న వారికి కొంత భరోసా ఇస్తున్నట్లుగానే ఉన్నాయనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles