తెలిసో తెలియకో మనలో తప్పులు చాలా మంది చేస్తారు. కానీ చేసిన పని తప్పు అనే సంగతిని ఎంత తొందరగా గుర్తిస్తారో, దాన్ని దిద్దుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తారో అనేదాన్ని బట్టి వారి గుణగణాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఏపీ రాజకీయాలను చూస్తే ఈ నీతి గుర్తుకు వస్తోంది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం.. ఆయన అనుచరులు, అభిమానులు, భక్తులు విచ్చలవిడిగా రెచ్చిపోయారు. తెలుగుదేశానికి చెందిన వారి బురద చల్లడంలోనూ, మహిళా నాయకుల మీద అసభ్యంగా కామెంట్లు చేయడంలోనూ చెలరేగిపోయారు. అలాంటి వారిలో ఒకరిద్దరిలో ఇప్పుడు పశ్చాత్తాపం వస్తోంది.
విషయం ఏంటంటే..
నందిగామ నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లగిరి గ్రామానికి చెందిన వైకాపా వార్డు సభ్యుడు వేల్పుల జైహింద్.. గతంలో అక్కడి తెదేపా నాయకురాలు తంగిరాల సౌమ్యపై విచ్చలవిడిగా అసభ్యకరమైన పోస్టులు పెట్టేవాడు. ఆమెను తూలనాడుతూ సోషల్ మీడియాలో చెలరేగిపోయేవాడు. వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేసిన జైహింద్.. అసహ్యకరమైన పోస్టులతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
తీరా ఎన్నికల్లో తంగిరాల సౌమ్య గెలిచి ఎమ్మెల్యే అయింది.
గతంలో ఓవరాక్షన్ చేసిన వారిమీద ప్రభుత్వం కత్తి దూస్తుందని భయమే కలిగిందో లేదా, ఇన్నాళ్లూ తాను చేసిన తప్పుడు పనుల గురించి పశ్చాత్తాపం కలిగిందో తెలియదు గానీ జైహింద్ మోకాళ్ల మీద కూర్చుని తనని క్షమించాలని కోరుతూ వీడియో చేసి పోస్టు చేశాడు. వ్యక్తిగతంగా కూడా సౌమ్యను కలిసి క్షమించాలని ప్రాధేయపడినట్టు తెలుస్తోంది. అలాంటి పోస్టులు పెట్టినందుకు తాను, తన కుటుంబం బాధపడుతున్నాం అని, ఇకపై అలాంటి పనిచేయనని వీడియోలో పేర్కొన్నాడు.
వేల్పుల జైహింద్ కు బుద్ధొచ్చినట్టే ఉంది. కానీ ఇది చాలదు కదా. జై జగన్ అంటూ సోషల్ మీడియాలో విషం కక్కడం, బురద చల్లడంలో చెలరేగిపోయిన వేల మందికి కూడా జైహింద్ లాగా బుద్ధి రావాలి.
వైసీపీ సోషల్ మీడియా అంటేనే తమ ప్రభుత్వం ఘనతను ప్రచారం చేసుకోవడం కాదు కదా.. తెలుగుదేశం, జనసేన నాయకులు, మహిళా నాయకుల మీద నీచమైన పోస్టులు పెట్టడమే పనిగా చెలరేగిపోయిన వారు. ఇప్పుడు ప్రభుత్వం కత్తి దూస్తే.. జైలపాలవ్వాల్సి వస్తుందనే భయంతో.. చాలా మంది జైహింద్ బాటలోనే పశ్చాత్తాప ప్రకటనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.