మద్యం కుంభకోణం తెరవెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? 3500 కోట్ల రూపాయల దందాలో.. సింహభాగం కాజేసిన అంతిమ లబ్ధిదారు ఎవరు? అనే సత్యాలను అన్వేషించడానికి సిట్ దర్యాప్తు బృందం గట్టి ప్రయత్నాలనే మొదలు పెట్టింది. ఈ కుంభకోణానికి కర్త కర్మ క్రియగా పేరుమోసిన కెసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు. తొలిరోజు విచారణలో ఆయన తన మార్కు బుకాయింపులతో కాలహరణం చేయడానికే ప్రయత్నించినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాగా, ఇప్పుడు ఇదే కేసులో మరో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ తోడల్లుడు చాణక్య ను కూడా పోలీసులు కస్టడీకి తీసుకుంటున్నారు. కోర్టు అనుమతించడంతో శనివారం నుంచి ఆయన పోలీసుల కస్టడీలోకి వస్తారు. తోడల్లుళ్లు ఇద్దరినీ జమిలిగా విచారించడం వలన.. బుకాయింపులకు ఆస్కారం ఉండదని.. కొన్ని సత్యాలు అయినా బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి.. సరికొత్త మద్యం పాలసీని రూపొందించడం దగ్గరినుంచి అంతా తానై కీలకంగా వ్యవహరించారు. ఏరకంగా ఈ పాలసీ ద్వారా దోచుకోవచ్చునో బ్రెయిన్ అంతా ఆయనదే అంటున్నారు. అందుకే ఆయన ఐటీ సలహాదారు హోదాలో అధికారిక పదవిలోకి వచ్చి.. వసూళ్ల నెట్ వర్క్ మొత్తాన్ని తన చేతులమీదుగా నడిపించారు. అయితే రాజ్ కెసిరెడ్డి తీసుకున్న జాగ్రత్త ఏంటంటే.. వసూళ్ల నెట్ వర్క్ లో పూర్తిగా తన సొంత మనుషుల మీదనే ఆధారపడ్డారు. ప్రధానంగా తన తోడల్లుడు చాణక్యను ఇందులో ఇన్వాల్వ్ చేశారు. అలాగే కొందరు మిత్రుల సహాయం తీసుకున్నారు. డిస్టిలరీలనుంచి డబ్బు పుచ్చుకోవడానికి హ్యాండ్లర్స్ ను వాడుకుంటూ వారిద్వారా మొత్తం సమీకరించి.. హైదరాబాదులోని ఒక కార్యాలయానికి డబ్బు చేర్చడాన్ని చాణక్య చూసుకునేవాడు. అక్కడినుంచి వివిధ రూపాల్లోకి బంగారం గాను, రియల్ ఎస్టేట్ పెట్టుబడులుగానూ ఆ ధనం తరలిపోయేది. అంతిమలబ్ధి మాత్రం బిగ్ బాస్ కు అందుతూ ఉండేది.
రాజ్ కెసిరెడ్డిని అరెస్టుచేసిన కొన్ని రోజులకు చాణక్య కూడా పోలీసులకు దొరికిపోయారు. ఆయనను ప్రాథమికంగా విచారించినప్పుడు వారికి కొన్ని విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఇప్పుడు రాజ్ కెసిరెడ్డి తొలిరోజు విచారణలో ఏమాత్రం సహకరించకపోయిన నేపథ్యంలో.. వసూళ్ల నెట్వర్క్ లో రాజ్ తరవాత అంతే కీలకంగా ఉన్న చాణక్యను కూడా ఇవాళ కస్టడీలోకి తీసుకుంటున్నారు. తొలుత ఇద్దరినీ ఒకే రకం ప్రశ్నలతో విడివిడిగా విచారించి సమాధానాలు రాబడతారు. ఆ తర్వాత ఇద్దరినీ కలిపి ఒకే చోట కూర్చుండబెట్టి.. మళ్లీ ప్రశ్నించడం ద్వారా.. ఇద్దరి జవాబులు సరిపోలుతున్నాయో లేదో.. ఎవరో అబద్ధాలతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారో తేలుస్తారు. మొత్తానికి ఈ తోడల్లుళ్లు ఇద్దరినీ ఏకకాలంలో జంటగా విచారించడం వలన.. కొత్త సత్యాలు వెలుగుచూడవచ్చునని పలువురు అనుకుంటున్నారు.
సత్యం తెలియాలి : తోడల్లుళ్లు ఇద్దరికీ జమిలి విచారణ!
Friday, December 5, 2025
