బొత్స చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు!

Tuesday, July 2, 2024

వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అడ్డూఅదుపు లేకుండా విచ్చలవిడిగా చెలరేగిన మంత్రులలో బొత్స సత్యనారాయణ కూడా ఒకరు. ఉత్తరాంధ్రలో కీలక నాయకుడైన బొత్స సత్యనారాయణను మధ్యలో మంత్రివర్గాన్ని మార్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తొలగించలేకపోయారు. జగన్ కోటరీలో ఆయన బలం అది. అయితే జగన్ రెండో దఫా విస్తరణలో బొత్సకు విద్యాశాఖను కేటాయించారు. ఆ విద్యాశాఖ నిర్వహణలో పాల్పడిన అవినీతి ఇప్పుడు ఆయన మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది.

జగన్ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల కోడ్ రావడానికి కొంత ముందుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ బదిలీలను చేపట్టింది. ఈ బదిలీలలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. 50 కోట్ల రూపాయలకు మించి అవినీతికి పాల్పడినట్లుగా, బొత్స స్వాహా చేసినట్టుగా లెక్కలు తేలుస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం మీద ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. విచారణ సాగితే బొత్స సత్యనారాయణ ఊచలు లెక్కపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా అయిన బొత్స సత్యనారాయణ  తరఫున పిఏ, పలువురు ఉన్నతాధికారులు కలిసి బదిలీల కోసం ఒక్కొక్క టీచర్ నుంచి మూడు నుంచి ఆరు లక్షల రూపాయలు వసూలు చేశారనేది తెలుగుదేశం చేస్తున్న ప్రధాన ఆరోపణ. బదిలీలకోసం మంత్రిగా బొత్స సత్యనారాయణకు లక్షలకు లక్షలు ముడుపులు చెల్లించినా బదిలీ ఉత్తర్వులు ఇంకా చేతికి రాలేదని, ఆయన మాజీ అయిపోయారు ప్రభుత్వం కూడా మారిపోయిందని టీచర్లు గొల్లుమంటున్నారు. బొత్స సత్యనారాయణ అవినీతి బాగోతం ఆ రకంగా వెలుగులోకి వచ్చింది.

ఈ విషయంలో పూర్తి దర్యాప్తు చేసి అవినీతికి పాల్పడిన వారు ఎంతటి పెద్దవారైనా సరే శిక్షించి తీరాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నది. వైసీపీ ప్రభుత్వం చివరి రోజుల్లో చేసిన ఈ బదిలీలను మొత్తం రద్దు చేయాల్సిందిగా ఇప్పటికే ఉత్తర్వులు వచ్చేశాయి. ఇందులో అవినీతిని గ్రహించినందువల్లనే చంద్రసర్కారు ఏర్పడక ముందే ఆ దిశగా చర్యలు తీసుకున్నట్టు సమాచారం. దర్యాప్తు సాగితే గనుక.. బొత్సకు జైలుయోగం తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles