అమరావతి’ రాష్ట్ర ప్రజలు కలగంటున్న అద్భుత రాజధాని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘ప్రపంచం మొత్తం తలతిప్పి చూసేలా ఓ అద్భుత నగరంగా దీనిని తీర్చిదిద్దుతా’ అనే ప్రతిజ్ఞతో చంద్రబాబు నాయుడు అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రస్తుత పదవీకాలంలోనే అమరావతి నగరానికి ఒక నిర్దిష్టమైన రూపు వచ్చేలాగా.. రాజధానిగా అక్కడి నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభం అయ్యేలాగా ఆలోచనలు కార్యరూపం దాలుస్తున్నాయి. ఇదే సమయంలో అమరావతి- రాష్ట్రానికి రాజధానిగా నిలవడంతో పాటు యావత్ దేశానికి క్రీడా రాజధానిగా అవిర్భవించబోతోంది అనే మాట విన్నప్పుడు సహజంగానే మనకు మహదానందం కలుగుతుంది. 1600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని ప్లాన్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు అమరావతి నగరానికి ఈ రకమైన గుర్తింపును కూడా తీసుకురానున్నారు.
సాధారణంగా దేశానికి ఒక రాజధాని ఉంటుంది. కానీ ప్రాధాన్యాల పరంగా కొన్ని నగరాలు వివిధ అంశాలలో రాజధాని స్థాయి గుర్తింపుని తెచ్చుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు మన దేశానికి ఢిల్లీ రాజధాని అయితే, ముంబాయి మహా నగరాన్ని ఆర్థిక రాజధాని అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి నగరాన్ని దేశానికి క్రీడా రాజధానిగా తీర్చిదిద్దే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు విజయవాడ ఎంపీ, ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని ప్రకటిస్తున్నారు. క్రీడల నిర్వహణ పరంగా దేశానికే వన్నెతెచ్చేలా ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా దీనిని బట్టి మనకు అర్థమవుతోంది.
ప్రస్తుతం 54వేల ఎక రాలలో జరుగుతున్న అమరావతి పనులకు అదనంగా విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ కలిసి వచ్చేలా మరో 44వేల ఎకరాల భూములను సమీకరించడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అమరావతి నిర్మాణ పనులు ఊపందుకుంటున్న సమయంలోనే వీటికి సంబంధించి కూడా ప్రాథమిక ప్రక్రియ మొదలైపోతుంది. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం విషయంలో నిధుల పరంగా కొన్ని సానుకూలతలు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ కూడా 60 శాతం వరకు నిధులు సమకూర్చేందుకు ముందుకు వస్తోంది. అలాగే కేంద్ర క్రీడాభివృద్ధి శాఖ నుంచి కూడా నిధులు వచ్చే అవకాశం ఉంది. నిర్మాణం పూర్తయ్యాక వినియోగానికి సంబంధించి కూడా కాంట్రాక్టులు కుదిరే అవకాశం ఉంది. ఇవన్నీ సాకారం అయితే.. కేశినేని చిన్ని చెబుతున్నట్టుగా ఖచ్చితంగా అమరావతి దేశానికి క్రీడారాజధాని అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
‘దేశానికే క్రీడా రాజధాని’.. ఆ మాట ఎంత బాగుందో!
Friday, December 5, 2025
