విభజించు పాలించు అనేది బ్రిటిషు వాడు పరిపాలనలో మనకు నేర్పి వెళ్లిన సూత్రం. జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఆ సూత్రాన్నే ఫాలో అవుతున్నారో లేదా, తెలిసీ తెలియకుండా తన పార్టీ ముఠాకక్షలతో దెబ్బతింటూ ఉంటే తాను పరిస్థితిని చక్కదిద్దలేని స్థితిలో ప్రేక్షకుడిలా చూస్తూ కూర్చంటున్నారో అర్థం కావడం లేదు. మొత్తానికి అసలే దారుణ ఓటమిని చవిచూసిన తర్వాత.. ఐక్యంగా ఉంటూ ప్రజల్లో ఆదరణను పెంచుకోవాల్సిన వైసీపీ నాయకులు ఇప్పుడు పార్టీలో తమ వర్గాధిపత్యం కోసం, ప్రాబల్యం, పైచేయి కోసం ముఠాకక్షలతో కొట్టుమిట్టాడుతున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను గమనిస్తే.. అక్కడ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఇటీవలి కాలంలోనే జగన్ కు సన్నిహితంగా ఎదిగిన నాయకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డికి మధ్య ఆధిపత్య పోరాటాలు, విభేదాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహజంగానే ఎంతో సీనియర్ నాయకుడు కావడంతో పాటూ.. జిల్లా రాజకీయాలపై పట్టు కలిగిఉన్నారు. దీనికి గండికొట్టడానికి చెవిరెడ్డి ప్రయత్నించారు. గత ఎన్నికలకు ముందు జగన్ కోటరీలో ముఖ్యమైన వ్యక్తిగా చెవిరెడ్డి మారారు. ఆ బలాన్ని ఉపయోగించుకుని పెద్దిరెడ్డి ప్రాబల్యానికి చెక్ పెట్టారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తొలుత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించిన జగన్మోహన్ రెడ్డి.. ఆ తర్వాత కొంత కాలానికి ఆయనను పక్కకు తప్పిపంచి.. భూమన కరుణాకర్ రెడ్డి చేతుల్లో ఆ పదవిని పెట్టారు. అక్కడితోనే పెద్దిరెడ్డి అలకపూనడం జరిగింది. ఆ తర్వాత రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం సమయంలో ఈ అలక మరింతగా పెరిగింది. తొలుత పెద్దిరెడ్డికి చిత్తూరు, ప్రకాశం జిల్లాలు అప్పగించారు. అయితే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి నీడ కూడా పడడం ఇష్టం లేని చెవిరెడ్డి తాను స్వయంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీ అభ్యర్థి కావడం వల్ల అక్కడ కూడా పెద్దిరెడ్డి ఉండడానికి వీల్లేదని జగన్ వద్ద లాబీయింగ్ చేసి.. పెద్దిరెడ్డిని తప్పించారు. చివరికి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి కడప, కర్నూలు జిల్లాలు అప్పగించారు.
దీంతో పెద్దిరెడ్డి అలగడం జరిగింది. అసలే గత ప్రభుత్వ కాలంలో జరిగిన అనేక వ్యవహారాలలో పెద్దిరెడ్డి పాత్ర ఉన్నదనే అంతా అంటుంటారు. అప్పటి లావాదేవీలన్నీ కొత్త ప్రభుత్వం తిరగతోడుతున్న తరుణంలో పెద్దిరెడ్డిలో అసంతృప్తి పెరగడం మంచిది కాదని జగన్ భావించినట్టు సమాచారం. చివరకు జగన్ దిగివచ్చి.. కడప, కర్నూలుతోపాటు చిత్తూరు జిల్లాను కూడా రీజినల్ కోఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇది చెవిరెడ్డి భాస్కర రెడ్డికి కిట్టని నిర్ణయం అని చెప్పాలి. ఒకవైపు పార్టీ ఓడిపోయి కునారిల్లుతుండగా.. నాయకులు మాత్రం తమ ఆధిపత్యం కోసం ముఠాతగాదాలు నడుపుతున్నారని కార్యకర్తలు చిరాకు పడుతున్నారు.