చెక్కుచెదరని మోడీ హవా!

Saturday, December 7, 2024

తాజాగా వెల్లడైన ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఒక రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. మరో రాష్ట్రంలో ఓటమి పాలైంది. ఒకటి గెలిచారు- ఒకటి ఓడారు.. లెవెలైపోయింది కదా.. అని సింపుల్ గా అనేసుకోవడానికి వీల్లేదు. మహాయుతి అనే పేరుతో కూటమి రంగంలోకి దిగి వాళ్లు గెలుచుకున్నది 288 సీట్లు ఉండే మహారాష్ట్రను. అదే సమయంలో వాళ్లు ఓడిపోయింది.. 81 సీట్టున్న జార్ఖండ్ రాష్ట్రాన్ని! కాబట్టి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలకు పోలిక కరెక్టు కాదు. అలాగే.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికలలో కూడా యాభై శాతం సీట్లలో భాజపా కూటమి విజయం సాధించింది. ఈ ఫలితాలన్నీ దేశంలో నరేంద్రమోడీ హవా చెక్కు చెదరలేదని నిరూపిస్తున్నాయి.

ప్రత్యేకించి ఇవాళ ఫలితాలు వెలువడిన రెండు రాష్ట్రాల విషయానికి వస్తే రెండు చోట్ల కూడా ఎగ్జిట్ పోల్స్ దారుణంగా దెబ్బతిన్నాయి. జార్ఖండ్ లో కూడా బిజెపి కూటమి గెలవబోతున్నదని  దాదాపుగా అన్ని సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించాయి. కానీ.. ఫలితం అందుకు భిన్నంగా వచ్చింది. కేవలం 24 సీట్లకు వారు పరిమితం కావాల్సి వచ్చింది. హేమంత్ సోరెన్ నాయకత్వంలోని జేఎంఎం ఘన విజయం సాధించింది. అయితే అక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అందుకే జార్ఖండ్ లో గెలిచిన కూటమిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నప్పటికీ.. రాహుల్ గాంధీ గానీ, ఇతర కాంగ్రెస్ నాయకులు గానీ ఆ విజయాన్ని పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు.

మహారాష్ట్రలో కూడా ఎగ్జిట్ పోల్స్ ఫెయిలయ్యాయనే చెప్పాలి. ఎందుకంటే.. భారతీయ జనతా కూటమి పార్టీ ఇంత ఘనమైన మెజారిటీ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేుకపోయాయి. అందరూ ఇంచుమించుగా 150 అంకెకు అటుఇటుగానే చెప్పారు. కానీ ఏకంగా 236 స్థానాలను సాధించడం అనేది అనూహ్యమైన సంగతి. మహారాష్ట్ర ఫలితాలు ఈ స్థాయిలో ఉంటాయని అస్సలు ఊహించలేకపోయాం అని రాహుల్ గాంధీ తదితరులు అంటున్నారు. అయితే ఈ ఫలితాలు దేశంలో నరేంద్రమోడీ హవా ఇసుమంత కూడా తగ్గలేదని నిరూపిస్తున్నట్టుగా భావించాలని విశ్లేషకులు అంటున్నారు.

మోడీ తొలి రెండు సార్లు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పుడు.. భాజపా ఒక్కదానికే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనంత మెజారిటీ ఉన్నప్పటికీ.. ఎన్డీయే రూపంలోనే గద్దె ఎక్కారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు అంత భారీగా సీట్లు రాలేదు. దీంతో మోడీ పని అయిపోయిందని, ఆయన హవా తగ్గుముఖం పడుతున్నదని ప్రత్యర్థులు విమర్శించడం ప్రారంభించారు. అలాంటి వారి అంచనాలను పటాపంచలు చేస్తూ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు సంచలనంగా వెలువడ్డాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles