‘ఇవాళ ఏదైతే విత్తుతున్నావో.. రేపటికి ఆ ఫలాలే కదా నీకు లభిస్తాయి’ అని ఒక ఇంగ్లీషు సామెత చెబుతుంది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసో లేదో మనకు తెలియదు. విదేశాల్లో చదువుకున్నానని చెప్పుకునే జగన్ కు ఆ మాత్రం తెలిసి ఉండదని అనుకోవడానికి కూడా వీల్లేదు. కానీ.. ఆ నీతిని ఆచరణలో పాటించడం మాత్రం ఆయనకు తెలియదు. పోలీసు అధికారులు, సిబ్బంది మీద ఇప్పుడు ఇంత తీవ్రస్థాయిలో విషం కక్కడం జరుగుతూ ఉంటే.. రేపు ఒకవేళ మళ్లీ తాను సీఎం అయితే మాత్రం.. వారినుంచి గౌరవం లభించడం ఎలాసాధ్యమని జగన్ అనుకుంటున్నారో ఎవ్వరికీ బోధపడ్డం లేదు. తాజాగా రాష్ట్ర పోలీసు సంఘం అధికారులు.. జగన్ మాటలు, ఆ పార్టీ నాయకుల వాచాలత్వం గురించి చేసిన విమర్శలు గమనిస్తే ఈ అభిప్రాయమే కలుగుతుంది.
వైఎస్ జగన్ పాలన కాలంలో అప్పటి పోలీసులు కూటమి నాయకుల పట్ల, చంద్రబాబునాయుడు, నారా లోకేష్ పట్ల వ్యవహరించిన దుర్మార్గపు తీరుకు, ఇప్పుడు కూటమి పాలనలో పోలీసులు వైసీపీ నేతల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు చాలా వ్యత్యాసం ఉంది. అప్పట్లో అన్ని రకాల అనుమతులతో ఉన్న కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటే కూడా.. అప్పటికప్పుడు విధించిన ఆంక్షలతో తెలుగుదేశం నేతలు, నారా లోకేష్ ను ఇబ్బందిపెట్టడానికి పోలీసులు అడ్డదారులు తొక్కుతూ దూకుడుగా వ్యవహరిస్తూ, తీవ్రమైన భాషలో మాట్లాడుతూ.. జగన్ కళ్లలో తాము ఆనందం నింపగలమని అనుకున్నారు. అందుకే నారా లోకేష్ నోటమ్మట రెడ్ బుక్ అనే పదం కూడా అప్పుడే వచ్చింది.
అయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటి? జగన్ వ్యవహరిస్తున్న తీరే.. ప్రతి చోటా, ప్రతి సందర్భంలోనూ కూడా పోలీసులను రెచ్చగొట్టడమే లక్ష్యం అన్నట్టుగా సాగుతోంది. దీని వల్ల ఆయన ఏం సాధిస్తున్నారు. ఆయన పట్ల మొత్తం పోలీసు శాఖలోనే గౌరవం పలచన అయిపోతుంది కదా అనేది ప్రజల సందేహం. పోలీసులు తనకు అనుమతులు ఇచ్చినా సరే.. వాటిని ధిక్కరించడమే తన జీవితాశయం అన్నట్టుగా జగన్ ప్రవర్తిస్తుంటారు. పోలీసులు తమ పని తాము చేస్తే.. మా పార్టీ వారిని వేధిస్తున్నారని అనడం.. కాస్త ఉపేక్ష వహిస్తే.. నా ప్రాణాలకు భద్రతలేకుండా చేశారని ఆక్రోరశించడం జగన్ పద్ధతిగా మారింది. రెండు నాల్కల ధోరణితో జగన్ ప్రజల్లో చులకన అవుతున్నారు. అదే సమయంలో.. పోలీసు అధికారుల సంఘం వారు కూడా వైసీపీ తీరును తప్పుబట్టడాన్ని గమనించాలి.
పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద జగన్ కు అభ్యంతరాలు ఉంటే గనుక.. వారితో అలా పనిచేయిస్తున్నారని ప్రభుత్వాన్ని నిందించవచ్చు. దానివల్ల ఆయనకు రాజకీయ ప్రయోజనం కూడా ఉంటుంది. కానీ.. పోలీసులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అసభ్యంగా దూషించడం, బట్టలు విప్పదీసి కొడతానని అనడం.. ఆయనకే పరువు నష్టం అని జగన్ తెలుసుకోవడం లేదు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు ప్రభుత్వం గన్ మెన్ ను కేటాయిస్తే.. అతడిని తన బానిసలాగా వాడుకోవడం అందరికంట పడింది. చిత్తూరు జిల్లా ఎస్పీ అతడిని సస్పెండ్ చేశారు. దీనిపై వైసీపీ నాయకులు మాట్లాడుతూ చిత్తూరు ఎస్పీపై రౌడీషీట్ తెరుస్తాం అని ఆగ్రహిస్తే ఏం వస్తుంది? నాయకులు మారుతారు గానీ.. అధికారులు మారరు కదా. నాయకుల మీద ద్వేషాన్ని, వారిని ఓడించలేకపోయిన తమ చేతగానితనాన్ని అధికారుల మీద విషంలా కక్కితే జగన్ దళాలకు ఏం ఒరుగుతుంది.. అనేది ప్రశ్న. ఇదే ధోరణి కొనసాగితే.. ఆయన గెలిచినా అధికారులు మొక్కుబడిగా పనిచేస్తారు తప్ప ఆయన పట్ల గౌరవంతో ఉండలేరని, ఒకవేళ్ల మళ్లీ ఓడితే.. ఆయన భవిష్యత్తు మరింత దుర్భరంగా తయారవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
జగన్‌కు గడ్డు భవిష్యత్తు ఇవ్వనున్న వాచాలత్వం!
Friday, December 5, 2025
