బాలినేనికి అనూహ్య ప్రాధాన్యం కారణమిదే..

Monday, January 27, 2025

మళ్లీ లేచి నిల్చోవడం సాధ్యం కాని పని అని కార్యకర్తలు నమ్ముతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వదలి బయటకు రావడానికి అందులోని చాలా మంది నాయకులు రెడీగా ఉన్నారు. అదేవిధంగా.. అటు తెలుగుదేశంలో గానీ, ఇటు జనసేనలో గానీ చేరడానికి కూడా ఆల్రెడీ రాజీనామా చేసిన వారు, కొత్తగా రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్న వారు అనేకమంది మంతనాలు సాగిస్తున్నారు. ఇంతమంది ఉండగా.. బాలినేని శ్రీనివాస రెడ్డికి మాత్రమే దాదాపుగా తొలి తాంబూలం ఎందుకు దక్కింది? ఇది సహజంగా అందరి మదిలో మెదలుతున్న ప్రశ్న.

అయితే దానికి సరైన కారణమే ఉంది. ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టాలని ఖాళీ చేయించాలని కూటమి చాలా పట్టుదలగా ఉంది. రాష్ట్రంలో ఇన్ని జిల్లాలు ఉండగా.. ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రమే ఎందుకు? అనే ప్రశ్నకు కూడా ఒక సమాధానం ఉంది. ఆ జిల్లాలో ఆ పార్టీకి రెండు సీట్లు దక్కాయి. ఆ బలం కూడా లేకుండా చేయాలనేది కూటమి వ్యూహం. అందుకే బాలినేని శ్రీనివాసరెడ్డికి రెడ్ కార్పెట్ వేసి చేర్చుకోవడం!

ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను చేసి ఉత్తరాంధ్రను మొత్తం ఉద్ధరించేస్తానని చెప్పిన జగన్ మాయమాటలు ప్రజలు పట్టించుకోలేదనడానికి నిదర్శనంగా ఉత్తరాంధ్రలో వైసీపీకి రెండు సీట్లు వచ్చాయి. ఆ తర్వాత అక్కడినుంచి దిగువకు వస్తే.. ఆంధ్రా జిల్లాల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఉత్తరాంధ్ర తర్వాత ఆ పార్టీ సీట్ల బోణీ కొట్టినది ప్రకాశంలోనే. తర్వాత నెల్లూరు కూడా ఖాళీ. అలా జరిగింది. అందుకోసమే ప్రకాశం జిల్లాలో ఆ పాటి బలం కూడా లేకుండా చేయడానికి బాలినేనికి తొలి తాంబూలం ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు.
బాలినేని కూడా ప్రస్తుతం అదే పనిమీద ఉన్నారు. జిల్లాలో వైసీపీ కార్యకర్తలతో మీటింగులు పెట్టుకుని.. వారినందరినీ కూడా తనవెంట జనసేనలోకి వచ్చేయమని అడుగుతున్నారు. బాలినేని అయితే కేవలం ఒంగోలు నియోజకవర్గం వరకు పరిమితం కాకుండా.. జిల్లా వ్యాప్తంగా ఎంతో కొంత ప్రభావితం చేయగలిగిన నాయకుడు గనుక.. ఆయనను వైసీపీని ఖాళీ చేయించడానికి వాడుకోవాలని కూటమి పార్టీలు చూస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles