పదినెలల కిందటి వరకు మొదటి సారి ప్రజలకు సీఎంగా సేవ చేయడానికి అవకాశం దక్కించుకున్న జగన్ పరిపాలన సరళిని ప్రజలు అయిదేళ్లపాటు గమనించారు. ఇప్పుడు నాలుగోసారి అలాంటి అవకాశాన్ని దక్కించుకున్న చంద్రబాబునాయుడు తీరును కూడా గమనించారు. ఎవరెన్ని చెప్పినా సరే.. ప్రజలు చాలా తెలివైన వాళ్లు. ముఖ్యమంత్రులుగా ఈ ఇద్దరి వ్యవహార సరళి మధ్య వ్యత్యాసాలను చాలా నిశితంగా గమనిస్తున్నారు. నక్కకు నాగలోకానికి తేడా ఉన్నట్లుగా.. ఈ ఇద్దరి మధ్య ఇంత తేడా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు కూడా!
చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి. ఒకవైపు సీఎంగా విపరీతమైన కార్యభారాలను ఆయన నెత్తిన పెట్టుకున్నారు. అమరావతిలో ఉన్నంతకాలమూ.. ఊపిరిసలపనంతగా బిజీగా పనులు, శాఖల సమీక్ష, అధికార్లతో సమీక్షలు తదితర సమావేశాలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఇంత పనుల ఒత్తిడి మధ్యలో విస్తృతంగా రాష్ట్రంలో పర్యటనలు కూడా సాగిస్తున్నారు. ప్రతి నెలా ఒకటోతేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తడవకు ఒక చోట నిర్వహిస్తూన్నారు. అదొక్కటే కాదు. ఆయా గ్రామాల్లో ప్రజలతో మమేకం అవుతున్నారు. పేదల ఇళ్లకు వెళుతున్నారు. వారితో కొంత సమయం గడుపుతున్నారు. వారికి తాను ఆత్మీయమైన వ్యక్తిని అనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమాలు కాకుండా మరికొన్ని ప్రజలతో కలిసి పోయే కార్యక్రమాలు కూడా ప్రతినెలా ఏదో ఒకటి ఉంటూనే ఉన్నాయి.
అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా ఆయన పర్యటనలు సాగించారు. ఒక దళిత మెకానిక్ దుకాణానికి కూడా వెళ్లారు. వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. తాడికొండ మండలం పొన్నెకల్లులో రోడ్డు మీద వెళుతున్న కాన్వాయ్ ను చంద్రబాబు హఠాత్తుగా ఆపించి.. ఒక దుకాణంలోకి వెళ్లారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణం అది. దుకాణంలో ఉన్న మహిళతో కాసేపు మాట్లాడి.. ఆమె కుటుంబం, జీవనోపాధి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ఉపాధి కల్పించే ఏర్పాట్లు చూడాలని కూడా చంద్రబాబు కలెక్టరును ఆదేశించారు.
సాధారణంగా ముఖ్యమంత్రుల కార్యక్రమాలు చాలా కాలం ముందే డిసైడ్ అవుతాయి. పెన్షన్ల పంపిణీ అయినా సరే.. ఏ గ్రామంలో ఎవరి ఇంటికి వెళతారో.. ముందే నిర్ణయం అవుతుంది. భద్రత పరంగా ఇలాంటి ఏర్పాట్లుంటాయి. అలాంటిది చంద్రబాబునాయుడు అనూహ్యంగా రోడ్డు మీద వెళుతూ వెళుతూ కాన్వాయ్ ఆపించి.. చిన్న దుకాణంలోకి ఎంట్రీ ఇచ్చి ప్రజల సాధకబాధకాలు తెలుసు కోవడం చాలా విశేషమైన సంగతి. మంచి పాలకుడి లక్షణాల్లో అది ఒకటి.
ఇలాంటి విషయాలనే ప్రజలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. గత అయిదేళ్లలో సీఎం పర్యటన అంటే ఎలా ఉండేది. ఆయన రోడ్డు మీద వస్తున్నారంటే చాలు.. రోడ్డు పక్కన బారికేడ్లు.. పరదాలు, చెట్లను నరికేయడాలు, దుకాణాలు మూయించడాలు ఇలాంటి నానా చండాలమైన భద్రత ఏర్పాట్లుండేవి. అయిదేళ్ల పాటు అలాంటి వాటితో ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక ఈ ఇద్దరు నాయకుల మధ్య వ్యత్యాసాన్ని వారు చాలా చక్కగా బేరీజు వేసుకుంటున్నారు.