‘ప్రవాహంలో పడి మునిగిపోతున్నవాడు మూర్ఖు‘డు అయినప్పుడు.. వాడిని కాపాడడానికి చేయి అందిస్తే, వాడు మనల్ని కూడా ముంచేస్తాడు’ అని అర్థం వచ్చేలా ఇంగ్లిషులో ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అచ్చంగా అదేవిధంగా తయారైనట్టుగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి యొక్క, లేదా, ఆయనను నమ్ముకుని ఆయనతో కలిసి ప్రస్థానం సాగిస్తున్న వారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో.. తెలుగుదేశం సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు జోస్యం చెబుతున్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు- ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయనే సిద్ధాంతం.. జగన్మోహన్ రెడ్డికి అచ్చంగా సరిపోతుందని యనమల అంటున్నారు.
గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చిన షేర్లను తిరిగి తీసుకోవడానికి తల్లికి వ్యతిరేకంగా ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పాతాళానికి కూరుకుపోయారని యనమల రామకృష్ణుడు తన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆ పాతాళంలోంచి ఆయనను బయటకు తీసి కాపాడడం సంగతి దేవుడెరుగు! కాపాడడానికి జగన్ చేయి పట్టుకున్న వాళ్లంతా పాతాళంలోకే కూరుకుపోతారని కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఈ గొడవను కేవలం ఆస్తుల వివాదంగా చూడడానికి లేదని, ఇది ఖచ్చితంగా రాజకీయ ఆత్మహత్య అని పేర్కొంటున్నారు. కుటుంబ తగాదాలను వారే రోడ్డుకీడ్చుకుని మీడియా మీద చంద్రబాబు మీద పడి ఏడవడం సరికానది యనమల అంటున్నారు.
చెల్లెలికి, తల్లికి జగన్ చేసిన అన్యాయం గమనిస్తున్న ప్రజలు ఆయనను ఛీత్కరించుకుంటున్నారనేది యనమల రామకృష్ణుడు పరిశీలన. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కలేనని.. అందుకే ఆ పార్టీలోని ఎవరికి వారు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సిద్ధాంతం ప్రకారం ఇతర పార్టీల్లోకి వలసలు వెళ్లిపోతున్నారని యనమల వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ సగం మునిగిపోయిన నావ వంటిదని.. పూర్తిగా మునిగిపోకముందే అందరూ బయటకు దూకేయడం బెటర్ అని ఆయన అంటున్నారు. ఆర్థిక నేరస్తుడు 11 ఏళ్ళుగా బెయిలుపై బయటే తిరుగుతూంటే దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్న యనమల రామకృష్ణుడు.. పాత కేసులకు కొత్త కేసులు కూడా తోడై ఆయన త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయం అని జోస్యం చెబుతున్నారు.
జగన్ జట్టు కడితే పతనం తప్పదంటున్న జోస్యం!
Tuesday, December 24, 2024