ఒక నిర్దిష్టమైన వ్యూహం ప్రణాళికతో.. పార్టీ ఒక కార్యక్రమం ప్రకటించింది అంటే దాని వెనుక చాలా ఆలోచన ఉంటుంది. అది పార్టీ విస్తృత ప్రయోజనాలను.. నాయకుల భవిష్యత్తును సుస్థిరం చేయడానికి, వారి ప్రజాదరణను పదిలంగా కాపాడడానికి అయిఉంటుంది. అలాంటి నేపథ్యంలో పార్టీ పిలుపు ఇచ్చే కార్యక్రమాలను పట్టించుకోకపోవడం వలన.. నాయకులకు, ఎమ్మెల్యేలకు కూడా నష్టం జరుగుతుంది.
ఇదే విషయాన్ని.. సిద్ధాంతాన్ని ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పల్లా శ్రీనివాసరావు! సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని తమతమ నియోజక వర్గాల్లో ముందుకు తీసుకెళ్లడంలో వెనుకబడిన తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన కర్తవ్యోపదేశం చేస్తున్నారు.
సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని నిర్వహించడంలో పూర్తిగా దృష్టి కేంద్రీకరించలేకపోయిన 9 నియోజకవర్గాలనుంచి అక్కడి ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులను పిలిపించారు పల్లా శ్రీనివాసరావు. తమ తమ నియోజకవర్గాలలో కనీసం 30 వేల కంటె తక్కువ ఇళ్లకు తిరగడం మాత్రమే పూర్తిచేసిన వారిని ఈ రకంగా పిలిపించి.. పార్టీ చేపట్టి కార్యక్రమం యొక్క సదుద్దేశాన్ని వారికి తెలియజేశారు. వీరిలో మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వంటి సీనియర్లు కూడా ఉండడం గమనార్హం. ఎవరినీ తేడాగా చూడకుండా కేవలం పనితీరు ప్రాతిపదికగా పిలిపించి వారికి కార్యక్రమం ప్రాధాన్యతను తెలియజెప్పారు. ఇతర కార్యక్రమాల ఒత్తిడి వల్ల కేశవ్, పార్లమెంటు సమావేశాల వల్ల కలిశెట్టి రాకపోయినప్పటికీ.. పార్టీ ఇలాంటి ప్రయత్నం చేయడం మంచిదని కార్యకర్తలు అంటున్నారు.
వెనకబడ్డ ఎమ్మెల్యేలకు, ఇన్చార్జిలకు పల్లా శ్రీనివాసరావు దీని ప్రయారిటీ తెలియజెప్పారు. ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ అనే ప్రయత్నం పార్టీ నాయకుల మేలు కోసమే అని.. నియోజకవర్గాల్లో ప్రజలతో వారికి సంబంధాలు దృఢతరం అవుతాయని తద్వారా.. వారికే మేలు జరుగుతుందని పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు.
గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా నాలుగేళ్ల తర్వాత గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమం అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే.. ఎమ్మెల్యేలందరూ ఇంటింటికీ తిరిగి మీకు అందుతున్న ప్రతిరూపాయి జగనన్న ఇస్తున్నదే.. జగనన్నకు మీరు రుణపడి ఉండాలి.. జగన్ గెలవకపోతే.. మీకు ఇవేమీ అందవు అని భయపెట్టడం తప్ప.. సాధించింది మరేమీ లేదు. కేవలం ఎన్నికలు దగ్గరపడ్డాయి గనుక.. ప్రజలను ఒక భయంలోకి నెట్టి.. వారితో ఓట్లు వేయించుకోవడం అనేదే లక్ష్యంగా జగన్ ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ .. చంద్రబాబునాయుడు అలా కాదు. ఒక ఏడాది ముగియగానే ఎమ్మెల్యేలు అందరినీ ప్రజల చెంతకు పంపే ప్రయత్నాన్ని ఈ కార్యక్రమం ద్వారా చేశారు. తద్వారా గెలిచిన తర్వాత నాలుగైదేళ్లకు వాళ్ల మొహం చూస్తాం అని కాకుండా.. నిత్యం ప్రజలతో మమేమకమై ఉంటామనే సందేశాన్ని ప్రజల్లోకి పంపారు. ఇలా పార్టీ కార్యచరణ.. నాయకుల మేలుకే దారితీస్తుందని.. దీనిని నిర్లక్ష్యం చేయకుండా అందరూ పాటించాలని పల్లా శ్రీనివాసరావు హితబోధ చేసి పంపడం గమనార్హం.
