గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకప్పట్లో తిరుగులేని రీతిలో తన హవా చెలాయించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన మాట సాగింది. జగన్ పాలన వచ్చాక.. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి.. జగన్ పంచన చేరారు. అధికార పార్టీలో ఉండి చెలరేగిపోయారు. రాష్ట్ర రాజకీయాల్లో జగన్ దక్కిన ఒక్కచాన్స్ తో ఆయన శకం అంతరించిన తరువాత.. వల్లభనేని వంశీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. అనేక అరాచకాల కేసులకు సంబంధించి ఆయన ప్రస్తుతం నిరంతర రిమాండ్లతో జైల్లోనే గడుపుతున్నారు. ప్రస్తుతానికి రెండు మూడు కేసుల్లో ఆయన రిమాండు అనుభవిస్తున్నారు. నిర్దిష్ట గడువు ముగిసిన వెంటనే.. ప్రతి కేసులోనూ తనకు బెయిలు ఇవ్వాలని ఆయన కోర్టులను అభ్యర్థిస్తున్నారు. కోర్టులు వాటిని తోసిపుచ్చుతున్నాయి. అయితే ఇంకా ఎన్నిసార్లు అడిగినా ఆయనకు బెయిలు వచ్చే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మూడింటిలో ఒక కీలక కేసులో ఆయన చేసిన నేరాలు, వ్యవహరించిన సరళి.. ఏ కేసులోనూ ఆయనకు బెయిలు వచ్చే అవకాశం లేకుండా చేసేస్తాయని వారు అంటున్నారు.
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీ నిందితుడు. అయితే.. ఆయన అతితెలివి ప్రదర్శించి.. ఆ కంప్లయింటు ఇచ్చిన టీడీపీ పార్టీ ఆఫీసు ఉద్యోగి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, నిర్బంధించి.. అతనితో ఎస్సీ ఎస్టీ కోర్టులో తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు. దాడిలో వంశీకి సంబంధం లేదన్నట్టుగా చెప్పించారు. కిడ్నాప్- నిర్బంధం సంగతి బయటపడి.. దాడికేసు కంటె ముందు.. కిడ్నాప్ కేసులోనే ఆయన అరెస్టు అయి రిమాండుకు వెళ్లారు.
ఆ తర్వాత టీడీపీ ఆఫీసుపై దాడికేసులో అరెస్టు అయ్యారు.. తర్వాత భూఆక్రమణ కేసుల్లో రిమాండుకు వెళ్లాల్సి వచ్చింది.
ఈ మూడు కేసుల్లోనూ ఒకదాని తర్వాత ఒకటి బెయిలు పిటిషన్ వేస్తున్నారు. సాధారణంగా బెయిలు ఇవ్వొద్దు అనడానికి విచారణ సంస్థలు వినిపించే వాదన ఒకటే ఉంటుంది. ఆయన బయట ఉంటే కేసుల విచారణను, సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారని అందువల్ల బెయిలు ఇవ్వొద్దని వాదిస్తుంటారు. మిగిలిన నాయకుల సంగతి ఎలా ఉన్నా.. వల్లభనేని వంశీ విషయంలో ఈ వాదనలను ప్రత్యేకంగా వినిపించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. అలాంటి తప్పుడు పనులు చేసినందుకే ఒక కేసులో ఆయన రిమాండులో ఉన్నారు.
ఈనేపథ్యంలో ఆయన బటయకు వస్తే.. మొత్తం కేసులను తారుమారు చేసేస్తారనే మాటను కోర్టులు నమ్ముతున్నాయి. వల్లభనేని వంశీ ఎన్నిసార్లు బెయిలు పిటిషన్ వేస్తున్నా వాటికి మోక్షం దక్కే అవకాశం లేదని అంటున్నారు. కానీ వంశీ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలాగా బెయిలుకోసం వరుసగా పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. దళితుడిని కిడ్నాపు చేసి సాక్ష్యాలు తారుమారు చేయాలనుకున్న ఒకే ఒక్క పాపం.. ఆయన అన్ని విజ్ఞప్తులను తోసిపుచ్చేందుకు కారణం అవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒక్కటే రీజన్.. ఎన్ని సార్లు అడిగినా నో అంటున్న కోర్టు!
Monday, December 8, 2025
