ఎవరైనా తప్పుచేసేసి.. ఆ తర్వాత దిద్దుకునే పరిస్థితి వస్తే ‘అడుసు తొక్కనేల.. కాలు కడగనేల’ అనే సామెతతో ఎద్దేవా చేస్తుంటారు పెద్దలు. కానీ కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పరిస్థితి పాపం.. ‘తాళి కట్టనేల.. తప్పు జరగలనేల.. లెంపలు వాయించుకోనేల.. క్షమాపణ చెప్పనేల’ అన్నట్టుగా తయారైంది. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే స్వగ్రామం చిప్పగిరి ఆంజనేయస్వామి ఆలయంలో రాములవారి కల్యాణోత్సవం జరిగింది. ఎమ్మెల్యే విరూపాక్షి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ పూజారి అందించిన రాములవారి తాళిబొట్టను.. విరూపాక్షి తానే సీతమ్మ విగ్రహం మెడలో కట్టి మూడు ముళ్లు వేసేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విరూపాక్షి చేసిన ఈ దుడుకు చర్య ఇప్పుడు సర్వత్రా విమర్శల పాలవుతోంది. కొంపలు అంటుకుపోతున్నాయని గుర్తించి.. విరూపాక్షి ఏదో మొక్కుబడి క్షమాపణలతో ఒక వీడియో విడుదల చేశారు గానీ.. వ్యవహారం ఇంతటితో సద్దుమణిగేలా లేదు. ఆయనపై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మామూలుగా శ్రీరామనవమి ఉత్సవాల్లో ప్రతిచోటా సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. స్వామివార్త ఉత్సవ ప్రతిమలను ఉంచి.. శ్రీరాముడి తరఫున ఆలయ పురోహితులే ఆగమశాస్త్రయుక్తంగా అమ్మవారి ప్రతిమకు మాంగల్య ధారణ చేయడం జరుగుతుంటుంది. ఆ పని చేయడానికి వారు ఎంతో నిష్టగా ఉంటారు. భగవంతుడి పట్ల అపరిమితమైన భక్తి విశ్వాసాలతో ఉంటారు. తమ ద్వారా భగవత్ స్వరూపుడైన రాముడు స్వయంగా చేయిస్తున్న పనిగా వారు దానిని పవిత్రంగా భావిస్తారు. ఆ పని చేసే పురోహితుడు అందుకోసం అనుసరించే నిష్ట ఇక్కడ ప్రధానమైనది.
కానీ తన స్వగ్రామం చిప్పగిరిలో జరిగిన కల్యాణోత్సవంలో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, సీతమ్మవారికి తాను స్వయంగా తాళి కట్టేయడం ఇప్పుడు సర్వ్రతా వివాదాస్పదం అవుతోంది. హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతుండగా.. ఆయన మాత్రం.. ‘తనకు అపరిమితమైన దైవ భక్తి అని, పురోహితుడు తన చేతికి ఇచ్చి కట్టమని చెబితేనే కట్టానని, తెలియక చేసిన తప్పు అని, ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని అంటున్నారు. పదిహేనేళ్లుగా అయ్యప్పస్వామి మాల కూడా వేస్తున్నానని చెప్పుకుంటున్న ఈ భక్తుడికి .. ఆమాత్రం ఆలయ మర్యాదలు, పద్ధతులు, సాంప్రదాయాలు పాటించడం గురించి తెలియదా.. అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాళి కట్టనేల.. లెంపలేసుకోనేల..!
Monday, April 28, 2025
