ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఆ మూడు స్థానాలు కూడా భర్తీ కాబోతున్నాయి. రెండు స్థానాల్లో ఎవరైతే రాజీనామా చేసారో… వారే తిరిగి ఆ పదవులను దక్కించుకోబోతున్నారు. మూడో స్థానం మాత్రం కొత్తగా సానా సతీష్ ను వరించనుంది. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో.. పొత్తు ధర్మాన్ని గౌరవించడానికి, పట్టుపట్టకుండా పార్టీ అవసరాల్ని గుర్తించి నడుచుకున్నందుకు, తాను ఆశించిన సీటును త్యాగం చేసినందుకు ప్రతిఫలంగానే సానా సతీష్ ను ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం వరించినట్టుగా తెలుస్తోంది.
ఏపీలో మూడు రాజ్యసభ ఎంపీ స్థానాలు సార్వత్రిక ఎన్నికల తర్వాత హఠాత్తుగా ఖాళీ అయ్యాయి. ఈ ఎన్నికల్లో తెలుగు ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించిన తీరు గమనించి నిర్ఘాంతపోయిన ఆ పార్టీలోని అనేకమంది నాయకులు ఉలిక్కిపడ్డారు. ఆ పార్టీనే నమ్ముకుని ఉంటే తమ బతుకు బస్టాండు అవుతుందని భయపడ్డారు. అందుకే ఆ పార్టీ కట్టబెట్టిన పదవులు కూడా తమకు వద్దనుకుని.. పార్టీకి ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవులకు కూడా రాజీనామా చేసేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రకంగా మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామా చేయడంతో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి.
ఆర్. కృష్ణయ్య తెలంగాణకు చెందిన వ్యక్తి. బీసీ సంఘాల నాయకుడు.. వైఎస్ జగన్ రాజ్యసభకు పంపారు. ఆయన రాజీనామా తర్వాత.. ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్నప్పటికీ.. బిజెపి నుంచి హామీ వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరారు. బిజెపి ఆయనను ఎంపీగా ఎంపిక చేసింది. మిగిలిన రెండు సీట్లు తెలుగుదేశానికే దక్కగా.. బీద మస్తాన్ రావును మళ్లీ సభకు పంపడానికి చంద్రబాబు నిర్ణయించారు. మూడోస్థానంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సానా సతీష్ ను ఎంపీగా ఎంపిక చేశారు.
సానా సతీష్.. గత ఎన్నికల్లో కాకినాడ నుంచి లోక్ సభ ఎంపీగా తెలుగుదేశం తరఫున పోటీచేయాలని అనుకున్నారు. కానీ.. ఆ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇవ్వాల్సి వచ్చింది. పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ జనసేనలో పనిచేసిన తంగెళ్ల ఉదయశ్రీనివాస్ ను పవన్ కల్యాణ్ కాకినాడ ఎంపీ స్థానానికి ప్రకటించారు. తాను పిఠాపురం ఎమ్మెల్యే సీటు కోరుకోవడంతో తంగెళ్లకు ఎంపీ సీటు దక్కింది. పవన్ తో పొత్తును గౌరవించడం కోసం సానా సతీష్ కాకినాడను వదులుకున్నారు. అప్పుడు చేసిన త్యాగానికి ఫలితంగానే ఇప్పుడు రాజ్యసభ ఎంపీ పదవి దక్కినట్టుగా పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
ఆ త్యాగానికి ఫలితంగానే ఎంపీ పదవి!
Tuesday, January 21, 2025