ఎంతో సదుద్దేశంతో.. మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం చంద్రబాబు నాయుడు సర్కారు మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ అవకాశం కల్పించింది. అయితే ఆర్టీసీ సంస్థ నిర్వహణలో ఉన్న కష్ట నష్టాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల వంటి నాన్ స్టాప్ సర్వీసులు, ఘాట్ రోడ్ సర్వీసులకు ఉచితం వర్తించదని చెప్పారు. అది ఫైనల్ నిర్ణయం కాకపోగా అమలు తీరును సమీక్షిస్తూ గమనించిన ప్రకారం మార్పు చేర్పులు చేస్తున్నారు. ఈలోగానే తిరుమలకు ఉచిత ప్రయాణ అవకాశం ఇవ్వకుండా.. ప్రభుత్వం మోసం చేస్తున్నదంటూ జగన్ దళాలు పెద్దపెట్టున గోల ప్రారంభించాయి. విషం కక్కసాగాయి. మహిళల మనోగతం కూడా తెలుసుకున్న ప్రభుత్వం ఇప్పుడు తిరుమలకు కూడా ఉచిత ప్రయాణ అవకాశం కల్పించింది. తద్వారా.. విషం కక్కుతున్న జగన్ దళాల నోర్లు మూయించింది.
ఒక పథకాన్ని అమలు చేయడం అంటే.. ఏదో ఒక ఏసీ గదిలో కూర్చుని కొన్ని ఆలోచనలు తయారుచేసి.. అమలులో పెట్టేసి.. ఆ తర్వాత అందులో చిన్న మార్పులు చేయాల్సి వచ్చినా సరే పట్టించుకోకుండా అహంకారం ప్రదర్శించడం కాకూడదు. సుదీర్ఘ చర్చల తర్వాత ఒక పథకానికి విధివిధానాలను రూపొందించినప్పటికీ.. ఆచరణలో పెట్టిన తర్వాత.. వచ్చే అభిప్రాయాలను బట్టి అందులో మార్పు చేర్పులు అవసరం అవుతాయి. ఈగోకు పోకుండా.. పథకాన్ని సమీక్షించుకుంటూ అవసరమైన మార్పు చేర్పులు చేసుకుంటూ పోవాలి. చంద్రబాబునాయుడు సారథ్యంలోని ఎన్డీయే కూటమి సర్కారు.. ఇదే విధమైన శాస్త్రీయ విధానాన్నే అనుసరిస్తోంది. ఆగస్టు 15న స్త్రీశక్తి పథకాన్ని అమలు చేశారు. ప్రారంభంలో ఘాట్ రోడ్లలోను, తిరుమల వంటి చోట్లకు ఉచిత ప్రయాణాన్ని మినహాయించారు.
అయితే రెండోరోజు సాయంత్రమే అధికారులు నాయకులతో సమీక్షించిన చంద్రబాబునాయుడు.. అప్పటిదాకా మహిళల స్పందనల్ని తెలుసుకున్నారు. ఘాట్ రోడ్లలో మినహాయించడం వలన.. మన్యం ప్రాంతాలలో వేలాది మంది మహిళలకు తమ పథకం అందడం లేదని గుర్తించారు. వెంటనే అదేరోజున ఘాట్ రోడ్లలో కూడా వర్తించేలా నిబంధనలు మార్చారు. అలాగే మళ్లీ మళ్లీ సమీక్షల ద్వారా ప్రజాభిప్రాయం తెలుసుకోవడంలో ఇప్పుడు తిరుమలకు కూడా ఉచిత ప్రయాణం వర్తింపజేస్తున్నారు.
కానీ.. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేలోగా.. విషం కక్కి బద్నం చేయాలని చూడడం వైఎస్సార్ కాంగ్రెస్ దళాలకు అలవాటు అయిపోయింది. దుర్మార్గపు ఎత్తుగడలో వారు చెలరేగిపోతున్నారు. కానీ.. వారు ఇలాంటి కుటిలబుద్ధితో విషంకక్కడం వలన.. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్న వెంటనే.. ప్రభుత్వం మీద ప్రజల్లో గౌరవం పెరుగుతోంది. వారి విషప్రచారం తుస్సుమంటోందని మహిళలు వ్యాఖ్యానిస్తున్నారు.
