కడప ఎంపీ బరిలో కాంగ్రెసు పార్టీ తరఫున పోటీచేస్తూ.. జగన్-అవినాష్ ద్వయానికి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్న వైఎస్ షర్మిల ధాటిని తట్టుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ నానా పాట్లు పడుతున్నది. ఎక్కడెక్కడినుంచో ఎవ్వరెవ్వరినో పిలిపించి మరీ.. షర్మిలను తిట్టడానికి, ఆమె క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి జగన్ దళం ప్రయత్నిస్తూ ఉన్నది. షర్మిల సాగిస్తున్న బస్సుయాత్ర, చిన్నాన్న వివేకానందరెడ్డిని చంపిన హంతకుడిగా అవినాష్ రెడ్డిని జనంలో కడిగేస్తున్న తీరు, హంతకుడిని కాపాడుతున్న వ్యక్తిగా జగన్ ని తూర్పారపడుతున్న తీరు వారు సహించలేకపోతున్నారు. ఆ క్రమంలో తాజాగా జగన్ తన మేనత్త విమలమ్మను ప్రయోగించారు.
ఒక వీడియోను విడుదల చేసిన విమలమ్మ అందులో షర్మిల, సునీత లను ఒక స్థాయిలో తిట్టిపోశారు. తన మేనకోడళ్లు షర్మిల, సునీత ఇద్దరూ తమ నోటికి వచ్చినట్టల్లా మాట్లాడుతూ.. తమ కుటుంబం పరువు రోడ్డుకీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీత చేస్తున్న పనులకు తమ కుటుంబం మొత్తం ఏడుస్తున్నారట. ఇంతా కలిపి అవినాష్ ను వెనకేసుకు రావడానికే ఆమె మీడియా ముందుకు వచ్చినట్టు కూడా అదే వీడియోలో తేల్చేశారు. అవినాష్ రెడ్డి హత్య చేయడం వీళ్లు చూశారా? ఎవరు హత్య చేశారో వీళ్లే తేల్చేస్తే.. ఇక కోర్టులు జడ్జీలు ఉన్నదెందుకు అనేది విమలమ్మ వాదన.
అయితే మేనత్త మాటల దాడితోనే వ్యవహారం ముగిసిపోలేదు. దానికి షర్మిల కూడా చాలా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. తన కొడుకుకు జగన్ రెడ్డి కోట్లాది రూపాయల కాంట్రాక్టులు అప్పనంగా ఇస్తున్నందువల్లే.. విమలమ్మ తమ మీద విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ స్పష్టమైన ఆధారాలు కూడా చూపినందువల్లే తాము అవినాష్ ను హంతకుడు అంటున్నామని, గాలివాటుగా చెప్పడం లేదని వివరణ ఇచ్చారు. విమలా రెడ్డికి , తన సోదరుడు వివేకానందరెడ్డి ఎంత మేలు చేశారో గుర్తుకు రావడం లేదా అని కూడా అన్నారు. ఈ రకంగా అత్తాకోడళ్లు తీవ్రస్థాయిలో ఒకరి గురించి ఒకరు మాటలు రువ్వుకోవడం కడపజిల్లా రాజకీయాల్ని హీటెక్కిస్తోంది.
అయితే ఇక్కడ ఒక సంగతి గమనించాల్సి ఉంది. కుటుంబం అంతా ఏడుస్తున్నారని విమలమ్మ అంటున్నారే.. నిజానికి తన సొంత సోదరుణ్ని చంపినవాళ్లకు అయిదేళ్లు గడుస్తున్నా శిక్ష పడనందుకు ఆమె ఏడవాలి గానీ… వీరి విమర్శల గురించి ఏడిస్తే ఎలా అనేది ప్రజల విమర్శ. గత కొన్ని నెలలుగా.. రాష్ట్రమంతా తిరుగుతూ చర్చి పాస్టర్లతో సమావేశాలు నిర్వహిస్తూ వారికి నగదు పంపిణీ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేయించడానికి చాపకింద నీరులా ఆమె పనిచేస్తున్నారని.. ఇప్పుడు షర్మిలను తిట్టిపోయడానికి జగన్ ప్రత్యేకంగా తెరమీదకు తెచ్చారని విమర్శలున్నాయి.
మాటలు రువ్వుకున్న అత్తాకోడళ్లు!
Sunday, December 22, 2024