వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్ల కాలమూ ఎక్కడ ఏ బహిరంగసభకు వచ్చినా సరే.. ఒక మాట చెబుతూ వచ్చారు. నా దగ్గర వాళ్లలాగా డబ్బులులేవు, వాళ్ల మాదిరిగా నాకు పత్రికలు లేవు, టీవీ ఛానెళ్లు లేవు.. అంటూ నానా అబద్ధాలు పబ్లిగ్గా చెబుతూ వచ్చారు. సాక్షి మీడియా, పత్రిక తనవి కాదు అని ప్రజలను నమ్మించవచ్చునని జగన్ ఎలా అనుకున్నారో కూడా తెలియదు. అప్పటినుంచి ఇప్పటిదాకా మీడియా తమ చేతిలో ఉన్నది గనుక.. ఏ అబద్ధాలనైనా విస్తృతంగా ప్రచారంలో పెట్టవచ్చునని, తాము తలచిన స్థాయిలో ఎవరిమీదనైనా ఎలాంటి నిందలైనా వేయవచ్చునని వారు తలపోస్తున్నారు. ఇప్పుడు కడపజిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు గమనిస్తే ఎవరికైనా అదే అనిపిస్తోంది.
పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో.. ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడానికి, సంచలనంగా మార్చడానికి వైసీపీ నానా పాట్లు పడుతోంది.
సతీష్ రెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చి.. తన మీద దాడి చేయబోతున్నట్టుగా తెలుగుదేశం నాయకులే తనకు ఫోను చేసి బెదిరించారని ఆయన అంటున్నారు. నన్ను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే, నాపై దాడి జరిగితే సుమోటోగా స్వీకరించండి.. లోకేష్ ను, బీటెక్ రవిని బాధ్యలుగా పరిగణించండి.. అని ఆయన ముందే చెప్పేస్తున్నారు. ఇలాంటి మాటలు చెప్పిన తర్వాత.. ఆయనను వైసీపీ నాయకులే దాడిచేసి కొట్టి, ఆయన ముందు చెప్పినట్లుగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసే అవకాశం ఉన్నదని కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు.
తన మీద దాడి జరిగితే సీబీఐతో విచారణ జరిపించాలని అంటున్న సతీశ్ రెడ్డి తన గురించి తాను ఎంత ఎక్కువగా ఊహించుకుంటున్నారో అర్థం కావడం లేదు.
అయినా ఇక్క ఒక విషయం గమనించాల్సి ఉంది. వైసీపీ నుంచి తెలుగుదేశం లోకి మారిన విశ్వనాథరెడ్డి ని వైసీపీ నాయకులు కొందరు దారుణంగా బెదిరించారు. ఆయన ఆ ఫోన్ కాల్ రికార్డులతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు విచారణకు నోటీసులు కూడా పంపడం జరిగింది. ఎంతో సీనియర్ అయిన సతీశ్ రెడ్డి.. గాలిపోగు చేసి ఆరోపణలు చేయడం కాకుండా, కాస్త సాక్ష్యాధారాలతో నిందలు వేయాలనే కనీస అవగాహన ఆయనకు లేకపోవడం దారుణం. లేదా.. నా మీద దాడి జరగబోతోంది అంటూ.. మసిగుడ్డ కాల్చి ఎదుటివారి మొహాన పడేస్తే.. కడుక్కోవడం వాళ్ల ఖర్మ అని ఆయన ఫిక్సయినట్టుగా కనిపిస్తోంది.
తెలుగుదేశం నాయకులే ఫోను చేశారన్నట్టుగా సతీశ్ రెడ్డి చెబుతున్న బెదిరింపులు నిజమే అయితే.. ఆయన ఆ కాల్ రికార్డుల, కనీసం కాల్ డేటాతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఆ పనిచేయకుండా.. సాక్షితో చెప్పుకుని, తన మీద దాడిజరిగితే సుమోటో గా కేసు పెట్టుకోవాలని చెప్పడంలోనే ఆయన కుట్ర అర్థమవుతోందని ప్రజలు అనుకుంటున్నారు.
ప్రాణహాని పేరుతో నీలిదళాల సరికొత్త డ్రామాలు!
Monday, December 8, 2025
